T20 World Cup: ఫైనల్లో.. సరైనోళ్లే

అయిదేళ్ల విరామం తర్వాత  జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోతుంది. టోర్నీ ఆరంభమైనపుడున్న అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న ...

Updated : 13 Nov 2021 10:54 IST

ఈనాడు క్రీడావిభాగం

అయిదేళ్ల విరామం తర్వాత  జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోతుంది. టోర్నీ ఆరంభమైనపుడున్న అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న టీమ్‌ఇండియా సూపర్‌-12 దశను కూడా దాటలేదు. సూపర్‌-12లో ఘనవిజయాలతో ఫేవరెట్లుగా అవతరించిన ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ సెమీస్‌ గడప దాటలేకపోయాయి. ఇప్పటిదాకా కప్పు గెలవని, పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా ఇప్పుడు కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. వీటి ఆట చూశాక సరైన జట్లే ఫైనల్‌ చేరాయన్న భావన కలుగుతోంది అందరికీ. టీమ్‌ఇండియా నిష్క్రమణతో కళ తప్పినట్లు కనిపించిన ప్రపంచకప్‌ రసవత్తర సెమీఫైనల్‌ సమరాలతో మళ్లీ అందరి దృష్టినీ  ఆకర్షించి, క్రికెట్‌ ప్రపంచాన్ని ఏకం చేయడం కొసమెరుపు.

టీ20 ప్రపంచకప్‌లో ప్రతికూల పరిస్థితులను దాటి.. ఫేవరేట్లను వెనక్కినెట్టి.. అంచనాలను మించి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా తుదిపోరుకు చేరాయి. టోర్నీలో జట్ల ప్రదర్శన పరంగా చూస్తే ఉత్తమంగా రాణించిన సరైన జట్లే ఫైనల్లో అడుగుపెట్టాయని అందరూ అంటున్నారు. సూపర్‌- 12 దశలో రెండు గ్రూపుల నుంచి అగ్రస్థానాల్లో నిలిచి ముందంజ వేసిన జట్లను కివీస్‌, ఆసీస్‌ ఓడించాయి. గ్రూప్‌-2లో అజేయంగా నిలిచిన పాకిస్థాన్‌పై ఆసీస్‌ సంచలన విజయాన్ని అందుకుంది. మరోవైపు గ్రూప్‌-1లో దక్షిణాఫ్రికాతో ఓటమి మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ సత్తాచాటిన ఇంగ్లాండ్‌ను విలియమ్సన్‌ సేన అనూహ్యంగా మట్టికరిపించింది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా మారిన ఈ రెండు జట్లు..  ఇప్పుడు టైటిల్‌ పోరులో సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.

అంచనాలకు మించి..

ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల బ్యాటర్లున్న ఇంగ్లాండ్‌ ఈ సారి విజేతగా అవతరిస్తుంది.. జట్టు నిండా హిట్టర్లతో కూడిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ముచ్చటగా మూడోసారి ఛాంపియన్‌గా నిలుస్తుంది.. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటుంది.. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత యూఏఈలో పొట్టి ఫార్మాట్లో ఓటమే ఎరుగని పాకిస్థాన్‌ కప్పు ఎగరేసుకుపోతుంది.. ఇలా టోర్నీ ఆరంభానికి ముందు కొనసాగిన చర్చల్లో టైటిల్‌ ఫేవరేట్లుగా వివిధ జట్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరు కూడా ఆస్ట్రేలియా కానీ లేదా న్యూజిలాండ్‌ కానీ ఈ సారి కప్పు అందుకుంటుందని చెప్పలేకపోయారు. అందుకు టోర్నీకి ముందు ఆ జట్ల ప్రదర్శనే కారణం. ఈ ప్రపంచకప్‌నకు ముందు ఆసీస్‌ వరుసగా వరుసగా అయిదు టీ20 సిరీస్‌ల్లో పరాజయం పాలైంది. మరోవైపు కివీస్‌ ప్రదర్శన కూడా ఆశాజకనంగా ఏమీ కనిపించలేదు. టీ20ల్లో బంగ్లాదేశ్‌పై తొలిసారి సిరీస్‌ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్లు అనూహ్యంగా రాణించాయి. సూపర్‌- 12 దశలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ ఆ తర్వాత బలంగా పుంజుకున్న కివీస్‌.. భారత్‌తో సహా వరుసగా నాలుగు జట్లను ఓడించింది. మరోవైపు పటిష్ఠమైన జట్లతో నిండి ఉన్న  గ్రూప్‌- 1లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ చేతిలో ఓడినప్పటికీ తిరిగి చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ముందంజ వేసింది. సరైన సమయంలో వార్నర్‌తో సహా ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌ అందుకోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది. దూకుడుకు ప్రశాంతతను జతచేసి కివీస్‌ సమష్టిగా రాణించింది. ఆసీస్‌, కివీస్‌ రెండింటికీ యూఏఈ వేదికలు అంత కలిసొచ్చేవి కావు. ఇక్కడి స్పిన్‌ పిచ్‌లపై వాటికి పట్టు చిక్కడం కష్టమే అనుకున్నారు. కానీ ఆరంభంలో తడబడ్డా.. ఆపై పట్టుదలతో పోరాడి పిచ్‌లపై పట్టు సాధించాయి. కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టాయి. మంచి ఊపుమీదున్న జట్లతో హోరాహోరీ మ్యాచ్‌ల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడి మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఫైనల్‌ ఆడేందుకు తాము అన్ని విధాల అర్హులమని చాటాయి.

ఆసక్తి పోయిందనకుంటే..

టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా అడుగుపెట్టిన టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడడంతో భారత అభిమానులు తీవ్ర ఆవేదన చెందారు. రెండో మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో ఓడి సెమీస్‌ ఆశలు దాదాపుగా చేజార్చుకోవడంతో ఈ ప్రపంచకప్‌పైనే ఆసక్తి కోల్పోయారు. కానీ హోరాహోరీగా సాగిన రెండు సెమీస్‌ మ్యాచ్‌లు తిరిగి టోర్నీ వైపు కళ్లు తిప్పేలా చేశాయి. అందుకు కచ్చితంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కారణం. ఆ రెండు సెమీస్‌ మ్యాచ్‌లు కూడా ఒకే రకమైన ఉత్కంఠతో దాదాపుగా ఒకేలా సాగడం విశేషం. మొదట ఇంగ్లాండ్‌పై మిచెల్‌, నీషమ్‌ మెరుపులతో ఛేదనలో కివీస్‌ 19వ ఓవర్లో గెలుపు అందుకోగా.. రెండో సెమీస్‌లో పాక్‌పై స్టాయినిస్‌, వేడ్‌ మెరుపులతో ఆసీస్‌ కూడా 19వ ఓవర్లోనే నెగ్గింది. రెండు జట్లూ ఓ దశలో ఓటమి దిశగా సాగి ఆఖర్లో సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్నాయి. దీంతో టోర్నీపై మళ్లీ ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. తుదిపోరులో ఏ జట్టు గెలిచినా దాని ఖాతాలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ చేరనుంది. మరి వన్డేల్లో రికార్డు స్థాయిలో అయిదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూ జట్టు పొట్టి కప్పు బోణీ కొడుతుందా? లేదా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన కివీస్‌ అదే జోరులో తొలిసారి టీ20 ఛాంపియన్‌గా నిలుస్తుందా? అన్నది చూడాలి.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts