WTC Final: మూడో రోజు న్యూజిలాండ్‌దే..

టీమ్‌ఇండియాతో తలపడుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ గట్టి పోటీనిస్తోంది. తొలుత భారత్‌ను 217 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఆ జట్టు తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది...

Updated : 20 Jun 2021 23:26 IST

బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అదరగొట్టిన కివీస్‌..

సౌథాంప్టన్‌: టీమ్‌ఇండియాతో తలపడుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ గట్టి పోటీనిస్తోంది. తొలుత భారత్‌ను 217 పరుగులకు ఆలౌట్‌ చేసిన ఆ జట్టు తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్ ‌(30; 104 బంతుల్లో 3x4), డెవాన్‌ కాన్వే (54; 153 బంతుల్లో 6x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించి కివీస్‌కు బలమైన పునాది వేశారు. అయితే, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని అశ్విన్‌ విడదీశాడు. 34.2 ఓవర్‌కు ఓ చక్కటి బంతితో లాథమ్‌ను బోల్తా కొట్టించాడు. తర్వాత కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(12*; 37 బంతుల్లో 1x4) తనదైనశైలిలో నిలకడగా ఆడి కాన్వేకు చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే కాన్వే అర్ధశతకం పూర్తిచేసుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే, ఇషాంత్‌ వేసిన 49వ ఓవర్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని షాట్‌ ఆడబోయి షమి చేతికి చిక్కాడు. దాంతో న్యూజిలాండ్‌ 101 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. అదే సమయంలో వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేశారు. విలియమ్సన్‌, రాస్‌టేలర్‌(0) క్రీజులో ఉన్నారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్లలో అశ్విన్‌, ఇషాంత్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించగా మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(49; 117 బంతుల్లో 5x4), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(44; 132 బంతుల్లో 1x4) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా మరో ఎండ్‌లో నీల్‌ వాగ్నర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ కట్టుదిట్టంగా బంతులేశారు. తొలుత మైదానం తడిగా ఉండటంతో ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న జేమీసన్‌ బంతిని స్వింగ్‌ చేస్తూ కోహ్లీ, పంత్‌(4)ను స్వల్ప వ్యవధిలో ఔట్‌చేశాడు. అనంతరం రహానె, జడేజా కాసేపు వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, పరుగుల వేగం పెంచే క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో వాగ్నర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 182/6గా నమోదైంది. అనంతరం అశ్విన్‌(22; 27 బంతుల్లో 3x4) ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 200 దాటాక అతడు సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 211/7 స్కోరుతో భోజన విరామానికి వెళ్లింది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఇషాంత్‌(4), బుమ్రా(0), జడేజా(15) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌ ఐదు వికెట్లు తీయగా వాగ్నర్‌, బౌల్ట్‌ చెరో రెండు వికెట్లు తీశారు. సౌథీ ఒక వికెట్‌ పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని