Published : 03 Jul 2021 01:17 IST

WTC Final: యుద్ధ నినాదాల్లా కివీస్‌ సంబరాలు!

బాధగా అనిపించిందన్న అశ్విన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమి బాధ కలిగించిందని టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. మ్యాచ్‌ ముగిశాక న్యూజిలాండ్‌ ఆటగాళ్లు రాత్రి 12 వరకూ మైదానంలో సంబరాలు చేసుకున్నారని పేర్కొన్నాడు. వారి కేరింతలు యుద్ధ నినాదాల్లా అనిపించాయని వెల్లడించాడు.

‘మ్యాచ్‌ ముగిశాక పానీయాలు, ట్రోఫీతో కలిసి సంబరాలు చేసుకోవడం న్యూజిలాండ్‌ అలవాటు. ఆ దృశ్యం చూడటానికి కష్టంగా అనిపించింది. వారు రాత్రి 12 వరకూ వేడుకలు చేసుకున్నారు. వారు ట్రోఫీ తీసుకొని పిచ్‌ వద్దకు వచ్చారు. నిజానికి వారి సంబరాలు నాకు యుద్ధ నినాదాల్లా అనిపించాయి. మేం గెలవనందుకు నిరాశపడ్డా’ అని అశ్విన్‌ చెప్పాడు.

‘ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను మూడు మ్యాచ్‌లుగా నిర్వహించాలని విరాట్‌ కోహ్లీ చెప్పాడని ఇతరులు అనుకోవడం నేను విన్నాను. కానీ, అదంతా తప్పు. ఆరోజు మ్యాచ్‌ పూర్తయ్యాక ఇంగ్లాండ్‌ మాజీ ప్లేయర్‌ మైఖేల్‌ అథర్టన్‌ కోహ్లీతో మాట్లాడుతూ ఈ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ను మరింత ప్రత్యేకంగా నిర్వహించాలంటే ఏం చేసేవాడివని అడిగారు. అప్పుడతడు స్పందిస్తూ.. ఫైనల్‌ను మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా నిర్వహిస్తే తొలి మ్యాచ్‌లో వెనుకబడిన జట్టు తర్వాతి మ్యాచ్‌లో పుంజుకుంటుందని, పరిస్థితులను కూడా అర్థం చేసుకునే వీలు కలుగుతుందనే ఉద్దేశంతో చెప్పాడు. కానీ, కోహ్లీ ఎప్పుడూ బెస్ట్‌ ఆఫ్‌ త్రీ కోసం డిమాండ్‌ చేయలేదు’ అని అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో వివరించాడు.

ప్రస్తుతం విరామం లభించడంతో అశ్విన్‌ తన కుటుంబంతో కలిసి బ్రిటన్‌ అంతా చుట్టేస్తున్నాడు. ‘మేం బయో బుడుగల్లో కాలం గడుపుతున్నాం. చాన్నాళ్ల తర్వాత బయటకు వచ్చాం. తాజా గాలి పీల్చుకుంటున్నాం. నేనో కారు అద్దెకు తీసుకున్నా. దేశమంతా తిరుగుతున్నా. మొదట మేం డేవాన్‌ సందర్శించాం. అదెంతో అందంగా ఉంది. ఆ తర్వాత సముద్రం, కొండ అంచులు కలిసే ప్రదేశానికి చేరుకున్నాం’ అని యాష్‌ చెప్పాడు.

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆరంభానికి మరో నెల రోజుల సమయం ఉంది. బ్రిటన్‌లో కేసులు తక్కువగా ఉండటంతో ఆటగాళ్లకు మూడు వారాలు విరామం ఇచ్చారు. బయో బుడగ నుంచి బయటకొచ్చిన క్రికెటర్లు కుటుంబ సభ్యులతో కలిసి దేశమంతా తిరుగుతున్నారు. దర్శనీయ స్థలాలకు వెళ్తున్నారు. ఆటలపై ఆసక్తి ఉన్నవారు యూరోకప్‌, వింబుల్డన్‌కు వెళ్తున్నారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని