IND vs NZ: ఇప్పుడు మూడో ర్యాంక్‌.. చివరి వన్డేలోనూ గెలిస్తే.. భారత్‌దే నంబర్‌వన్‌..!

న్యూజిలాండ్‌తో (IND vs NZ) జరిగిన రెండు వన్డేల్లోనూ టీమ్ఇండియా (Team India) ఘన విజయం సాధించింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకొంది. ఈ క్రమంలో ఐసీసీ (ICC) ర్యాంకింగ్స్‌లోనూ భారత్‌ తన స్థానాన్ని మెరుగుపర్చుకొంది. 

Updated : 22 Jan 2023 16:56 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌ మీద వరుసగా రెండు వన్డేలు గెలిచిన టీమ్‌ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోతోంది. సిరీస్‌ను కోల్పోయిన కివీస్‌ వన్డేల్లో రెండో స్థానానికి పడిపోయింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ (113) అగ్రస్థానంలో ఉంది. కివీస్‌, భారత్‌ కూడా 113 పాయింట్లతో సంయుక్తంగా ఉన్నప్పటికీ  కొద్దిపాటి తేడాతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా (112), పాకిస్థాన్‌ (106) టాప్‌-5లో ఉన్నాయి. 

భారత్- కివీస్ రెండో వన్డేకు ముందు.. న్యూజిలాండ్‌ 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండేది. భారత్ 111 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగేది. అయితే కివీస్‌ ఓడిపోవడం.. భారత్‌ విజయం సాధించడంతో ఇంగ్లాండ్‌కు కలిసొచ్చింది. కివీస్‌ ఖాతాలో 2 పాయింట్లు కోత పడగా.. టీమ్‌ఇండియాకి 2 పాయింట్లు అదనంగా యాడ్‌ అయ్యాయి. దీంతో భారత్‌ మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. కివీస్‌ రెండో స్థానంలోకి పడిపోయింది. మంగళవారం జరిగే చివరి వన్డేలోనూ టీమ్‌ఇండియా విజయం సాధిస్తే అగ్రస్థానంలోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌నూ భారత్‌ సొంతం చేసుకొంటే.. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అగ్రస్థానంలోకి వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి.

గిల్ 10 స్థానాలు ముందుకు..

కివీస్‌పై డబుల్‌ సెంచరీ సాధించిన శుభ్‌మన్‌ గిల్‌ (624 పాయింట్లు) ఏకంగా పది ర్యాంక్‌లను ఎగబాకి 26వ స్థానంలోకి దూసుకొచ్చాడు. స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ (750) కూడా నాలుగు స్థానాలను మెరుగుపర్చుకొని నాలుగో స్థానంలోకి వచ్చాడు. టీ20ల్లో మాత్రం సూర్యకుమార్‌ యాదవ్ (908 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని