Cricket: ఫుల్‌ స్పీడ్‌తో వికెట్లను తాకిన బంతి.. అయినా నాటౌట్‌గా నిలిచిన బ్యాటర్

క్రికెట్‌లో అప్పుడుప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. న్యూజిలాండ్ , శ్రీలంక (NZ vs SL) మధ్య జరిగిన వన్డేలోనూ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 

Updated : 26 Mar 2023 16:36 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని నమ్మశక్యం కాని సంఘటనలు చోటుచేసుకుంటాయి. శనివారం న్యూజిలాండ్, శ్రీలంక (New Zealand vs Sri Lanka) మధ్య జరిగిన తొలి వన్డేలోనూ ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌.. 49.3 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఫాస్ట్‌బౌలర్‌ కాసున్ రజితా వేసిన మూడో ఓవర్‌లో నాలుగో బంతిని ఫిన్‌ అలెన్ డ్రైవ్‌ చేయబోయాడు. కానీ, బంతి బ్యాట్‌కు తగలకుండా ఆఫ్‌ స్టంప్‌ని తాకింది. 

ఆసక్తికర విషయం ఏంటంటే.. బంతి అంత వేగంగా సంప్ట్‌ని తాకినా ఒక్క బెయిల్‌ కూడా కిందపడలేదు. దీంతో ఫిన్‌ అలెన్‌తోపాటు మైదానంలో ఉన్న ఆటగాళ్లు, కామెంటేటర్‌లు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన జరిగినప్పుడు 9 పరుగులతో ఫిన్‌ అలెన్ అనంతరం దూకుడుగా ఆడి అర్ధ శతకం (51) పూర్తి చేసుకున్నాడు. అతడు చివరకు రజితా బౌలింగ్‌లో కరుణరత్నెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడం గమనార్హం. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. హెన్రీ షిప్లే (5/31), డారిల్ మిచెల్ (2/12), టిక్నర్‌ (2/20) బంతితో విజృంభించడంతో.. 76 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్‌ 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని