T20 World Cup: ఇది కదా కివీస్‌ ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తి.!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగుతున్న సమయంలో బౌలింగ్..

Published : 13 Nov 2021 01:02 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబి వేదికగా బుధవారం జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉత్కంఠగా మ్యాచ్ సాగుతున్న సమయంలో బౌలింగ్ చేయడానికి వచ్చిన ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌.. కివీస్ బ్యాటర్ డెరిల్ మిచెల్‌ను పరుగు తీయకుండా నిలువరించాడు. అయినా, అతడు ఆవేశ పడకుండా క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. దీన్ని గమనించిన కామెంటేటర్ నాసర్‌ హుస్సేన్‌ కూడా ‘ఇది కదా న్యూజిలాండ్‌ అంటే‘ అని కితాబిచ్చాడు. ఆ వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో పంచుకుని కివీస్ ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..!

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన న్యూజిలాండ్‌ జట్టుకు ఆరంభంలోనే వరుస షాకులు తగిలినా.. ఓపెనర్ డెరిల్ మిచెల్ (72), డెవాన్ కాన్వే (46), జిమ్మీ నీషమ్‌ (27) రాణించారు. దీంతో ఇంగ్లాండ్‌పై కివీస్ జట్టు విజయం సాధించింది. ఆఖరి మూడు ఓవర్లలో కివీస్‌ విజయానికి 34 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే అదిల్ రషీద్‌ వేసిన 18వ ఓవర్లో ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్‌ తొలి బంతికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న మిచెల్ సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా రషీద్ అతడిని నిలువరించాడు. అయినా మిచెల్ ఏ మాత్రం కోప్పడకుండా క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. ఆ తర్వాతి బంతికే నీషమ్‌.. నాలుగో బంతికి మిచెల్ సిక్సులు బాదారు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్లో మరింత ధాటిగా ఆడిన మిచెల్ రెండు సిక్సులు, ఓ ఫోర్‌ సహా 20 పరుగులు రాబట్టాడు. దీంతో ఇంకా ఒక ఓవర్‌ మిగలుండగానే కివీస్ జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మీరూ చూసేయండి.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని