Women’s World Cup : హర్మన్ పోరాడినా.. టీమ్‌ఇండియాకు తప్పని ఓటమి

మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో...

Updated : 10 Mar 2022 14:15 IST

మహిళల ప్రపంచకప్‌ మ్యాచ్‌లో కివీస్‌ ఘన విజయం

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై గెలిచి ఊపు మీదున్న భారత్‌ను న్యూజిలాండ్‌ 62 పరుగుల తేడాతో చిత్తు చేసింది. టాస్‌ నెగ్గిన టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఎంచుకుని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతరం 261 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 198 పరుగులకే కుప్పకూలింది. టీమ్‌ఇండియా బ్యాటర్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్ (71) ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. మిగతా బ్యాటర్లలో యాస్తిక భాటియా 28, స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5, మిథాలీరాజ్ 31, స్నేహ్ రాణా 18, పూజా వస్త్రాకర్‌ 6, జులన్ గోస్వామి 15, మేఘ్న సింగ్‌ 12* పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో లీ తహుహు 3, అమెలీయా కీర్‌ 3.. జెన్‌సన్ 2.. జెస్ కెర్ర్‌, రోవే చెరో వికెట్ పడగొట్టారు.

ఆ నలుగురు కివీస్‌ను నిలబెట్టారు..

తొమ్మిది పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయిన కివీస్‌ను డివైన్‌ (35)తో కలిసి కెర్ర్‌ (50) ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు జోడించారు. అయితే డివైన్‌ పెవిలియన్‌కు చేరినా శాటర్త్‌వైట్ (75)తో కలిసి కెర్ర్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆడింది. ఈ క్రమంలో వీరు అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. గ్రీన్ (27), మార్టిన్‌ (41)లతో శాటర్త్‌వైట్ భాగస్వామ్యాలను నిర్మించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపింది. అయితే భారత బౌలర్లు ఆఖర్లో విజృంభించడంతో చివరి ఐదు ఓవర్లలో న్యూజిలాండ్‌ 27 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోవడంతో భారీ స్కోరును చేసే అవకాశం చేజారింది. టీమ్‌ఇండియా బౌలర్లలో పూజా వస్త్రాకర్‌ నాలుగు వికెట్లు తీయగా రాజేశ్వర్‌ గైక్వాడ్‌ రెండు, దీప్తి శర్మ, ఝులన్‌ గోస్వామి ఒక వికెట్‌ తీశారు.

ఝలన్‌ గోస్వామి రికార్డు

 భారత బౌలర్‌ ఝులన్‌ గోస్వామి తన ఖాతాలో ఓ రికార్డును వేసుకుంది. మహిళా ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు (39) తీసిన బౌలర్‌గా ఆసీస్‌కు చెందిన లిన్‌ ఫుల్‌స్టోన్‌తో కలిసి సంయుక్తంగా నిలిచింది. టీమ్‌ఇండియాకు ఇంకా మ్యాచ్‌లు ఉండటంతో గోస్వామి టాప్‌లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గోస్వామి (9-1-1-41) ఫర్వాలేదనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని