Nikhat Zareen: చాలా హ్యాపీగా ఉంది.. తర్వాతి టార్గెట్‌ అదే: నిఖత్‌ జరీన్‌

మరోసారి స్వర్ణ పతకం సాధించిన అదరగొట్టిన నిఖత్‌ జరీన్‌ తొలిసారి స్పందించారు. తన తర్వాతి టార్గెట్‌ ఏంటో చెప్పారు.

Updated : 26 Mar 2023 20:28 IST

దిల్లీ:  మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ (wWBC)లో వరుసగా రెండో ఏడాది స్వర్ణ పతకం సాధించి సత్తా చాటిన తెలంగాణ సంచలనం నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) తన అపూర్వ విజయంపై స్పందించారు. పసిడి పతకం (Gold medal) సాధించడం తనకెంతో ఆనందంగా ఉందన్న ఆమె... తనకెంతగానో సహకరించిన కోచ్‌, సపోర్టింగ్‌ సిబ్బందికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

50 కిలోల విభాగంలో సైతం ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. తన ప్రత్యర్థి న్యూయెన్‌ టాన్‌ ఆసియా ఛాంపియన్‌ కూడా అయినందున తనకు ఇది అత్యంత కష్టమైన బౌట్‌గా పేర్కొన్నారు. ఇక తన తర్వాతి లక్ష్యం ఆసియన్‌ గేమ్స్‌ అని చెప్పిన నిఖత్‌.. అక్కడ కూడా వియత్నాంకు చెందిన ఆమెను ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. ఈ విజయం తనకెంతో ఉత్సాహాన్నిస్తుందని.. ఆసియన్‌ గేమ్స్‌లోనూ మరింత మెరుగ్గా రాణిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. 

నిఖత్‌కు ప్రశంసల వెల్లువ

  • తన పవర్‌ఫుల్‌ పంచ్‌లతో సత్తా చాటిన నిఖత్‌ జరీన్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు బంగారు పతకంతో పాటు ప్రైజ్‌ మనీని అందజేశారు. అలాగే, బాక్సింగ్ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ సింగ్‌ నిఖత్‌ను వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌ బెల్ట్‌తో సత్కరించారు. 
  • గొప్ప విజయం సాధించి స్వర్ణపతకం గెలిచినందుకు నిఖత్‌కు దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అభినందనలు తెలిపారు.  ‘నిఖత్‌.. మీ అద్భుత ప్రదర్శన యావత్‌ దేశం ప్రతిష్టను పెంచింది’ అని ట్వీట్‌ చేశారు. 
  • బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలంగాణ గర్వించదగిన బిడ్డగా నిఖత్‌ను కొనియాడారు. 
  • మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన నిఖత్‌ జరీన్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.  బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అజయ్‌ సింగ్ ఆమెకు అభినందనలు తెలిపారు. నిఖత్‌ ఆట తీరు పట్ల ప్రశంసలు కురిపిస్తూ భారత్‌ మూడు స్వర్ణాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తంచేశారు.  దేశంలోని యువతులందరికీ నిఖత్‌ జరీన్‌ ఓ మెరుపులాంటి ఉదాహరణగా నిలుస్తారన్నారు.
  • తన పవర్‌ఫుల్‌ పంచ్‌లతో ప్రత్యర్థిని చిత్తు చేసి స్వర్ణం సాధించిన నిఖత్‌ జరీన్‌కు మంత్రి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఆమె సాధించిన విజయాలకు భారత్‌ గర్వపడుతోందని ట్వీట్‌ చేశారు.
  • భారాస ఎమ్మెల్సీ కవిత కూడా నిఖత్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ‘‘మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జెండా మరోసారి రెపరెపలాడింది.  పసిడి పతకం సాధించి దేశాన్ని గర్వపడేలా చేసిన నిఖత్‌ జరీన్‌కు కంగ్రాట్స్‌’’ అని కవిత పేర్కొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని