
జరీన్ పంచ్: 2సార్లు ప్రపంచ విజేత ఓటమి
దిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొడుతోంది. ఇస్తాంబుల్‌లో జరుగుతున్న బోస్ఫోరస్ బాక్సింగ్ టోర్నీలో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచ విజేతలకు వరుస షాకులిస్తోంది. 51 కిలోల విభాగంలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ నజిమ్ కిజైబేను ఆమె ఓడించింది. 4-1 తేడాతో మట్టికరిపించింది. 2014, 2016 ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో నజిమ్ స్వర్ణ పతకాలు కొల్లగొట్టడం గమనార్హం.
నిఖత్ గతంలో ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసంతో బాక్సింగ్ చేస్తోంది. ప్రిక్వార్టర్స్‌లో 2019 ప్రపంచ ఛాంపియన్, రష్యాకు చెందిన ఎకటెరినాను ఓడించి కాంస్యాన్ని ఖాయం చేసుకుంది. ఇప్పుడు క్వార్టర్స్‌లో ఏకంగా రెండుసార్లు విజేతను చిత్తుచేసి మెరుగైన పతకంపై గురిపెట్టింది. తన తర్వాతి పోరులో కఠిన ప్రత్యర్థి, 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత బెసునాజ్ కాకిరోగ్లుతో తలపడనుంది.
పురుషుల విభాగంలో 2018 కామన్వెల్త్ క్రీడల విజేత గౌరవ్ సోలంకి (57 కిలోలు) సెమీస్‌కు దూసుకెళ్లాడు. స్థానిక బాక్సర్ అయికోల్ మిజాన్‌ను చిత్తు చేశాడు. సాంకేతికంగా ఆధిపత్యం చెలాయించిన అతడు 4-1తో విజయం అందుకున్నాడు. సెమీస్‌లో అర్జెంటీనా బాక్సర్ నిర్కో కుయెల్లోను ఢీకొట్టనున్నాడు. భారత మరో అగ్రశ్రేణి బాక్సర్ శివథాప (63 కిలోలు)కు అదృష్టం కలిసిరాలేదు. టర్కీ క్రీడాకారులు హకన్ డొగాన్‌తో హోరాహోరీగా సాగిన పోరులో 1-4 తేడాతో వెనుదిరిగాడు. సోనియా లాథర్ (57 కిలోలు), పర్వీన్ (60 కిలోలు), జ్యోతి (69 కిలోలు) క్వార్టర్స్‌తోనే ముగించారు.