Rishabh: భవిష్యత్తు భారత సారథి పంత్‌

Sunil Gavaskar: రిషభ్‌ పంత్‌ టీమ్‌ఇండియా భవిష్యత్తు సారథి అనడంలో సందేహం లేదని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు....

Updated : 13 May 2021 12:20 IST

సన్నీ గావస్కర్‌ ప్రశంసలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: రిషభ్‌ పంత్‌ టీమ్‌ఇండియా భవిష్యత్తు సారథి అనడంలో సందేహం లేదని క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అన్నారు. ఐపీఎల్‌లో దిల్లీ  క్యాపిటల్స్‌ను అతడు చక్కగా ముందుకు నడిపించాడని పేర్కొన్నారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని తెలిపారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ ఏడాది దిల్లీని రిషభ్ పంత్‌ నడిపించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటంతో అతడికి అవకాశం వచ్చింది. దానిని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 8 మ్యాచుల్లో 6 విజయాలు అందించాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. అంతేకాకుండా సారథిగా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొంటూ నేర్చుకున్నాడు. ఇవన్నీ విశ్లేషకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

‘యువ రిషభ్ సారథ్యంలో దిల్లీ నిలబడింది. ప్రతిసారీ నాయకత్వం గురించి ప్రశ్నించే సరికి ఆరో మ్యాచుకే అతడు విసిగిపోవడం మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్‌ తర్వాత అతడిని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. చూసొచ్చేందుకు అనుమతిస్తే కాల్చొచ్చేందుకు సిద్దంగా ఉంటానన్న జ్వాలను అతడు ప్రదర్శించాడు. అవును, సారథిగా కొన్ని తప్పులు చేశాడు. కానీ, పొరపాట్లు చేయని సారథి ఎవరుంటారు?’ అని సన్నీ అన్నారు.

‘పొరపాట్ల నుంచి నేర్చుకొనే తత్వం రిషభ్‌లో కనిపించింది. చాలా సందర్భాల్లో అతడు ప్రత్యర్థి కన్నా ముందున్నాడు. జట్టును నడిపించేందుకు తనవైన దారులు వెతికాడు. అతడు భవిష్యత్తు సారథుల్లో ఒకరు. అందులో సందేహమే లేదు. ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు.. వినియోగించుకోవడానికి కావాల్సిన టెంపర్‌మెంట్‌ అతడిలో ఉంది’ అని సన్నీ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని