Harbhajan Singh: ‘దూస్రా’ ఇన్నింగ్స్‌లో ఇంతకు మించిన విజయం సాధించాలి : గీతా బస్రా

టీమ్‌ఇండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌.. హర్భజన్‌ సింగ్‌కి..

Published : 26 Dec 2021 01:35 IST

(Photo : Geetha Basra Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా దిగ్గజ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు చెప్పడంపై అతడి భార్య గీతా బస్రా భావోద్వేగానికి గురయ్యారు. భజ్జీకి అభినందనలు తెలుపుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘అభినందనలు భజ్జీ.. అంతర్జాతీయ క్రికెట్లో 23 ఏళ్లు కొనసాగడం మామూలు విషయం కాదు. ఈ క్షణం కోసం నువ్వు ఎన్ని రోజులు వేచి చూశావో నాకు తెలుసు. క్రికెట్‌కు మానసికంగా ఎప్పుడో దూరమైనా.. సరైన సమయంలో అధికారికంగా ఆ నిర్ణయాన్ని ప్రకటించాలని ఇన్నాళ్లు ఆగావు. నువ్వు మైదానంలో ఆడుతున్నప్పుడు.. నేను చేసిన ప్రార్థనలు, కలిగిన ఎగ్జైట్‌మెంట్‌ ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు సాధించిన ప్రతి విజయాన్ని పండగలా జరుపుకోవడం గొప్ప అనుభూతి. ఇన్నేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో.. ఎదురైన ఎత్తుపల్లాల్లో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. ముగింపు నువ్వు కోరుకున్న విధంగా ఓ ప్రణాళిక ప్రకారం జరగలేదని నాకు తెలుసు. కానీ, విధి మన చేతుల్లో లేదు. క్రికెట్‌పై ఉన్న ప్యాషన్‌తో ఇన్నేళ్లు ఎంతో గొప్పగా రాణించావు. దూస్రా (రెండో) ఇన్నింగ్స్‌లోనూ ఇంతకు మించిన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని గీతా బస్రా ట్వీట్‌ చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు హర్భజన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

నీ తర్వాతి అనౌన్స్‌మెంట్ కోసం వెయిటింగ్‌.. బ్రదర్

(Photo: Mohammad Kaif twitter)

భజ్జీ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుందని మహమ్మద్‌ కైఫ్ పేర్కొన్నాడు. ‘భజ్జీ.. మైదానంలో ఉన్నా, డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నా వాతావరణమంతా సందడిగా మారుతుంది. 2001లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌, 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ల్లో భారత్ సాధించిన చారిత్రక విజయాల్లో నీ పాత్ర కీలకం. నువ్వెప్పుడూ మ్యాచ్‌ విన్నర్‌వే. నీ  తర్వాతి అనౌన్స్‌మెంట్‌ కోసం వేచి చూస్తున్నా బ్రదర్’ అని మహమ్మద్ కైఫ్‌ ట్వీట్‌ చేశాడు. అద్భుతమైన క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్‌ సింగ్‌కు రోహిత్ శర్మ శుభాకాంక్షలు చెప్పాడు. ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘పోరాట యోధుడు.. అద్భుతమైన కెరీర్‌ భజ్జు పా. గొప్ప రిటైర్‌మెంట్. జీవితంలోని మరో పార్శం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’’ అని ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన హర్భజన్‌.. 417 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. వన్డే క్రికెట్‌లోనూ హర్భజన్‌ మెరుగ్గానే రాణించాడు. 236 వన్డేల్లో 269 వికెట్లు తీశాడు.

Read latest Sports News and Telugu News






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని