T20 World Cup: పాక్‌తో మ్యాచ్‌పై అభ్యంతరాలు.. మ్యాచ్‌ ఆడొద్దన్న కేంద్రమంత్రి!

కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠావలే సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కశ్మీర్‌లోని పరిస్థితుల దృష్ట్యా పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఉండకపోవచమే మంచిదని పేర్కొన్నారు.....

Updated : 20 Oct 2021 05:04 IST

దిల్లీ: క్రికెట్‌ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టీ20 ప్రపంచకప్‌ సందడి మొదలైంది. క్వాలిఫైయింగ్‌, వార్మప్‌ మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. అయితే భారత్‌లో అసలుసిసలైన క్రికెట్‌ మజా ఈనెల 24న మొదలుకానుంది. చిరకాల ప్రత్యర్థి పాక్‌తో టీమిండియా ఆరోజే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌పై భారత్‌లో అభ్యంతరాలు మొదలయ్యాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్‌ దుశ్చర్యల వల్ల భారత సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే ఆ దేశంతో టీ20 ఆడతారా? అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రధాని మోదీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అథవాలే సైతం పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై స్పందించారు. ప్రస్తుతం కశ్మీర్‌లోని పరిస్థితుల దృష్ట్యా పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. 

ఓ జాతీయ మీడియాతో అథవాలే మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌ ఆగడాలను అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ఆ దేశంపై యుద్ధం ప్రకటించాలి. పాక్‌తో మంచి సంబంధాలు కొనసాగించాలని భారత ప్రభుత్వం, ప్రధాని భావిస్తున్నప్పటికీ.. వారి ఉగ్ర చర్యలు ఆగడంలేదు. ఆ దేశంపై అంతిమ యుద్ధం ప్రకటించాలి. ప్రస్తుతం పాక్‌తో టీ20 మ్యాచ్‌ను నిలిపివేయాలి. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడతా’ అని వ్యాఖ్యానించారు. 

దాడులు ఆగేంతవరకు మ్యాచ్‌లు నిర్వహించకూడదు

దాయాది దేశంతో మ్యాచ్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు టీమిండియా నిరాకరించాలని ఆప్‌ మహిళా ఎమ్మెల్యే అతిషీ కోరారు. భారత్‌లో పాక్‌ ఉగ్రదాడులు ఆగిపోయేంతవరకు ఆ దేశంతో క్రికెట్‌ మ్యాచ్‌లు ఉండకూడదని డిమాండ్‌ చేశారు. భాజపా సర్కారు, ప్రధాని మోదీ సైతం తన డిమాండ్‌కు మద్దతిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. 

నిరాకరించే వీలులేదు.. మ్యాచ్‌ ఆడాల్సిందే!

పాక్‌తో మ్యాచ్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సోమవారం మాట్లాడిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్‌లో.. ఏ జట్టుకు కూడా మరొక జట్టుతో మ్యాచ్‌ ఆడేందుకు నిరాకరించే వీలుఉండదన్నారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ ప్రధాన ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని