పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌

బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ ఔటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుదురుకున్న హిట్‌మ్యాన్‌ అనవసర షాట్‌కు..

Updated : 16 Jan 2021 16:31 IST

విమర్శలపై స్పందించిన హిట్‌మ్యాన్‌

బ్రిస్బేన్‌ : బ్రిస్బేన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ ఔటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుదురుకున్న హిట్‌మ్యాన్‌ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడం విస్మయానికి గురిచేసిందని మాజీలు సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌మంజ్రేకర్,  ఆకాశ్ చోప్రా విమర్శించారు. అది బాధ్యతారాహిత్యమైన షాట్‌ అని విశ్లేషించారు. సామాజిక మాధ్యమాల్లోనూ రోహిత్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

అయితే తనపై వస్తున్న విమర్శలకు రోహిత్ బదులిచ్చాడు. ఆ షాట్‌ ఆడినందుకు పశ్చాత్తాపం లేదని అన్నాడు. గతంలో అదే టెక్నిక్‌తో విజయవంతంగా బౌండరీలు సాధించిన సందర్భాలను గుర్తుచేశాడు. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు అలాంటి షాట్‌లు ఆడతానని, ఇకపై కూడా కొనసాగిస్తానని తెలిపాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

‘‘ఆ షాట్ ఆడినందుకు పశ్చాత్తాపం పడట్లేదు. బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి అలాంటి షాట్‌లు ఆడతాను. లైయన్‌ తెలివైన బౌలర్‌. కష్టతరమైన బంతుల్ని విసురుతున్నాడు. అయితే అదే టెక్నిక్‌తో గతంలో ఎన్నో సార్లు విజయవంతమయ్యాను. కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు. మరికొన్ని సార్లు ఔట్ అవ్వొచ్చు. దురదృష్టవశాత్తు ఈ సారి ఔటయ్యాను. ఏదేమైనా అలాంటి షాట్‌లు కొనసాగిస్తాను. అయితే నాపై జట్టు ఎంతో నమ్మకం ఉంచింది. దానికి తగ్గట్లుగా ఆడటం నా బాధ్యత. విమర్శల గురించి ఆలోచించను. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది’’ అని రోహిత్ అన్నాడు.

గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్ 11 పరుగులకే గిల్‌ (7) వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన పుజారాతో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. అయితే అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్న హిట్‌మ్యాన్‌ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. లైయన్‌ వేసిన 20వ ఓవర్‌ అయిదో బంతికి మిడ్‌-ఆన్‌లో భారీషాట్‌కు ప్రయత్నించాడు. అయితే టైమింగ్‌ కుదరకపోవడంతో స్టార్క్‌ చేతికి చిక్కాడు. దీంతో అనవసర దూకుడుతో రోహిత్‌ ఆసీస్‌కు వికెట్‌ సమర్పించుకున్నాడని విమర్శలు వస్తున్నాయి.

ఇదీ చదవండి

రెండో రోజు ఆట రెండు సెషన్లే

రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని