
IND vs NZ: ఇద్దరినే తీసుకుంటే.. జడేజా, అక్షర్ పటేల్ ఒకేసారి ఆడలేరు: పాక్ మాజీ కెప్టెన్
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో భాగంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న స్పిన్నర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అన్నాడు. అయితే, ఇద్దరూ స్పిన్నర్లే కావడంతో.. వారు ఒకే మ్యాచ్‌లో ఆడలేరని పేర్కొన్నాడు. ‘అక్షర్ పటేల్ నాణ్యమైన స్పిన్నర్. ప్రస్తుతం మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. అయితే, రవీంద్ర జడేజా జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించగలడు. చాలా మంది సీనియర్లు ఈ టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో ప్రస్తుతం జడేజా అవసరం జట్టుకు చాలా ఉంది. జట్టు యాజమాన్యం కూడా జడేజా వైపే మొగ్గు చూపవచ్చు. అనుకోని పరిస్థితుల్లో జడేజా మ్యాచ్‌కు దూరమైతే తప్పా.. అక్షర్ పటేల్‌కి జట్టులో చోటు దొరకడం కష్టం. అందుకే వారిద్దరూ ఒకే మ్యాచ్‌లో ఆడటం దాదాపు కష్టమే అనిపిస్తోంది’ అని సల్మాన్ భట్ పేర్కొన్నాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్, భారత్ జట్లు చివరిసారిగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించి.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఇరు జట్లు టెస్టుల్లో తలపడటం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రోహిత్ శర్మ, మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో అజింక్య రహానె సారథ్యంలోని భారత్ జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.