Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్‌ ఖాతాలో పదో టైటిల్‌.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్‌

నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) పదోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్ (Australian Open 2023) టైటిల్‌ను కైవసం చేసుకొన్నాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో సిట్సిపాస్‌పై (Stefanos Tsitsipas) విజయం సాధించాడు.

Updated : 29 Jan 2023 18:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సెర్బియా టెన్నిస్‌ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌ తన కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ 2023 టైటిల్‌ ఫైనల్‌లో సిట్సిపాస్‌పై అద్భుత విజయం సాధించాడు. దీంతో పదో సారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకొన్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో 6-3, 7-6, 7-6 తేడాతో సిట్సిపాస్‌పై జకోవిచ్‌ గెలుపొందాడు. నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన జకోవిచ్‌ టోర్నీ ఆద్యంతం తన ఫామ్‌ను కొనసాగించాడు. అయితే ఫైనల్‌లో తొలి సెట్‌ను సులువుగానే సొంతం చేసుకొన్న జకో.. రెండు, మూడు సెట్లలో మాత్రం సిట్సిపాస్‌ నుంచి ప్రతిఘటన తప్పలేదు. చివరి రెండు సెట్లూ టై బ్రేక్‌ గేమ్‌లకు వెళ్లడం విశేషం. అయితే అక్కడా జకోవిచ్‌ ఆధిక్యం ప్రదర్శించి టైటిల్‌ను దక్కించుకొన్నాడు. 

కరోనా వ్యాక్సిన్‌ వ్యవహారం నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వెళ్లి మరీ గతేడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడకుండా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఈసారి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో తన ఛాంపియన్‌ ఆటతీరును జకోవిచ్‌ ప్రదర్శించాడు. టాప్‌ ఆటగాడు నాదల్ గాయం కారణంగా ఆరంభంలోనే ఇంటిముఖం పట్టడం కూడా జకోవిచ్‌కు కలిసొచ్చింది. అయితే ఫైనల్‌లో సిట్సిపాస్‌ నుంచి గట్టి పోటీనే తట్టుకొని మరీ టైటిల్‌ను సొంతం చేసుకొన్నాడు. దీంతో కెరీర్‌లో 22వ గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకొని నాదల్‌ (22)తో సమంగా నిలిచాడు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని