french open : ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ విజేత జకోవిచ్‌ 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను జకోవిచ్‌ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఐదోసీడ్‌ సిట్సిపాస్‌పై జకోవిచ్‌ 6-7, 2-6, 6-3, 6-2...

Updated : 14 Jun 2021 01:10 IST

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను జకోవిచ్‌ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో ఐదోసీడ్‌ సిట్సిపాస్‌పై జకోవిచ్‌ 6-7, 2-6, 6-3, 6-2,6-4 తేడాతో విజయం సాధించి మరోసారి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో జకోవిచ్‌ 19 గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి రెండు సెట్లను గెలిచి కెరీర్‌లో మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుందామనుకున్న గ్రీక్‌ వీరుడు సిట్సిపాస్‌ ఆశలను జకో వమ్ము చేశాడు.  తొలి రెండు కోల్పోయి వెనుకపడ్డ జకో.. అద్భుతంగా పుంజుకున్నాడు. ఇక ఆపై వెనుదిరగని జకో 6-3, 6-2తో ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. దీంతో నాలుగుసెట్లు ముగిసే సరికి ఇద్దరు సమంగా నిలిచారు. ఇక నిర్ణయాత్మక ఐదో సెట్‌ హోరాహోరీగా సాగింది. గెలుపు కోసం ఇద్దరూ తమ శక్తినంతా దారపోశారు. అయితే వరల్డ్‌ నంబర్‌వన్‌ జకో తన అనుభవంతో చివరిసెట్‌ను 6-4 తేడాతో గెలిచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ముద్దాడాడు. ఈ విజయంతో వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌లను కనీసం రెండుసార్లు గెలిచిన మొదటి వ్యక్తిగా జకో చరిత్రకెక్కాడు. జకోవిచ్‌ చివరిసారిగా 2016లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలుచుకున్నాడు. జకోవిచ్‌ మరో టైటిల్‌ సాధిస్తే 20 టైటిళ్లతో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ హోల్డర్లుగా ఉన్న ఫెదరర్‌, నాదల్‌ సరసన నిలుస్తాడు.  

డబ్సుల్స్‌లోనూ తనే..

మరోవైపు ఫ్రెంచ్‌ ఓపెన్ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి క్రెజికోవా-సినియాకోవా జోడీ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో క్రెజికోవా-సినియాకోవా జంట 6-4, 6-2 తేడాతో స్వైతెక్-సాండ్స్‌పై గెలుపొందారు. నిన్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను క్రెజికోవా గెలుచుకున్న విషయం తెలిసిందే. సింగిల్స్‌ విజేత డబుల్స్‌లోనూ గెలవడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని