Novak Djokovic: జకోవిచ్‌కు ఊరట.. ఆస్ట్రేలియాపై కేసు గెలిచిన టెన్నిస్ దిగ్గజం

టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు ఉపశమనం కలిగింది. ఆస్ట్రేలియా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్‌...

Updated : 10 Jan 2022 16:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్‌ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు ఊరట కలిగింది. ఆస్ట్రేలియా కోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. విచారణ అనంతరం అతడిని వెంటనే క్వారంటైన్‌ డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అతడి వీసాను కూడా పునరుద్ధరించాలని తెలిపింది. ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో పాల్గొనేందుకు ఈ సెర్బియన్‌ ఆటగాడు గత బుధవారం మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, అతడి వద్ద వాక్సినేషన్‌కు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా బోర్డర్‌ ఫోర్స్ అధికారులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ను ఆస్ట్రేలియాలోకి అనుమతించకుండా వీసాను రద్దు చేయడంతో పాటు డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.

ఈ విషయంపై న్యాయ పోరాటం చేసిన జకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో పాల్గొనేందుకు తనకు ప్రత్యేకమైన వైద్యపర మినహాయింపులు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే గతనెల 16న కరోనా బారిన పడ్డానని, తర్వాత కోలుకొని వైద్య మినహాయింపు పొందానని తన లాయర్ల ద్వారా కోర్టుకు విన్నవించాడు. సోమవారం విచారణ జరిపిన జడ్జి ఆంటోనీ కెల్లీ చివరికి అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా మెల్‌బోర్న్‌ విమానాశ్రయంలో జకోవిచ్‌తో అధికారులు ప్రవర్తించిన తీరుపై మండిపడ్డారు. అతడి వస్తువులు తిరిగివ్వాలని, వెంటనే డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే 20 గ్రాండ్‌స్లామ్‌లతో కొనసాగుతోన్న ఈ దిగ్గజ ఆటగాడు ఈ ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించి కొత్త రికార్డు నెలకొల్పాలని చూస్తున్నాడు. అయితే, జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడతాడో.. లేదా? తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని