Djokovic : వ్యాక్సిన్‌పై నమ్మకం లేని జకోవిచ్‌కు బయోటెక్‌ కంపెనీలో వాటాలు?

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వ్యవహారంతో ఏకంగా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన...

Published : 20 Jan 2022 21:52 IST

ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వ్యవహారంతో ఏకంగా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ గురించి మరో సంచలన విషయం బయటపడింది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ పనితీరుపై నమ్మకం లేదని గతంలో జకోవిచ్ చెప్పడం గుర్తుంది కదా.. అలాంటి జకోవిచ్‌ కరోనాకు ఔషధం అభివృద్ధి చేసే సంస్థలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ బయోటెక్ కంపెనీ సీఈవో వెల్లడించారు. ‘‘అవును కంపెనీ వ్యవస్థాపకుల్లో జకోవిచ్‌ ఒకడు. 2020 జూన్‌లో సంస్థను ప్రారంభించాం’’ అని క్వాంట్‌బయోరిస్‌ (QuantBioRes) సీఈవో ఐవాన్‌ లాంకేర్విక్‌ తెలిపారు. జకోవిచ్‌తోపాటు అతడి భార్య జెలెనా జంటకు సంస్థలో 80 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. క్వాంట్‌బయోరిస్‌ సంస్థకు డెన్మార్క్‌, స్లొవేనియా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల్లోని 20 ప్రాంతాల్లో కార్యాలయాలు ఉండటం గమనార్హం. 

‘‘వైరస్‌లపై పోరాడేందుకు, బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు కొత్త సాంకేతికను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. దాని కోసం కొవిడ్‌ను ఓ ఉదాహరణగా పరిశోధనలు చేపట్టాం. మేం కరోనా వైరస్‌పై విజయవంతమైతే ఇతర వైరస్‌ల మీదా సక్సెస్‌ అయినట్లే. ఈ వేసవిలో యూకేలో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం’’ అని సీఈవో వెల్లడించారు. అయితే బయోటెక్‌ సంస్థలో ఉన్న వాటాలపై స్పందించేందుకు నొవాక్‌ జకోవిచ్‌ అధికార ప్రతినిధి నిరాకరించారు. గత డిసెంబర్‌లో కరోనా బారిన పడటంతో వైద్యపరమైన మినహాయింపులు ఇవ్వాలని కోరినా.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఫెడరల్‌ కోర్టుకు వెళ్లాడు. అయినా అక్కడా జకోవిచ్‌కు చుక్కెదురు కావడంతో ఇంటిముఖం పట్టక తప్పలేదు. అయితే కరోనా వచ్చినా క్వారంటైన్‌లో ఉండకుండా పలు కార్యక్రమాల్లో జకో పాల్గొన్నట్లు ఫొటోలు బయటకు రావడంతో ఒక్కసారి స్టార్‌ ఆటగాడిపై విమర్శలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని