Novak Djokovic: యూఎస్‌ ఓపెన్‌కు అనుమతించకపోయినా వ్యాక్సిన్‌ వేసుకోను: జకోవిచ్

ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వాక్సినేషన్‌ వేసుకోనని మరోసారి తేల్చిచెప్పాడు టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌. ఇప్పటికే ఈ కారణం చేత ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌...

Published : 27 Jun 2022 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వాక్సినేషన్‌ వేసుకోనని మరోసారి తేల్చిచెప్పాడు టెన్నిస్‌ దిగ్గజం నోవాక్‌ జకోవిచ్‌. ఇప్పటికే ఈ కారణం చేత ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడలేకపోయిన అతడు త్వరలో జరిగే యూఎస్‌ ఓపెన్‌లోనూ అలాంటి పరిస్థితే ఎదురైతే పట్టించుకోనని చెప్పాడు. దీంతో ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లలో ఈ సెర్బీయా ఆటగాడికి రేపటి నుంచి ప్రారంభమయ్యే వింబుల్డన్‌ టోర్నీనే చివరిది కానుంది. అతడు తిరిగి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొనాలంటే వచ్చే ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరకు వేచి చూడాల్సిందే. వింబుల్డన్‌-2022 ప్రారంభానికి ముందు జకోవిచ్‌ మీడియాతో మాట్లాడాడు.

‘ప్రస్తుత పరిస్థితుల్లో నేను వాక్సినేషన్‌ వేయించుకోని కారణంగా ఈరోజు వరకు అమెరికాలో అడుగుపెట్టడానికి వీలులేదు. ఈ విషయం గురించి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అయితే, అది నాకు ఈ వింబుల్డన్‌ టోర్నీలో మరింత విశేషంగా రాణించడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. దీంతో వరుసగా నాలుగో సీజన్‌లోనూ ఈ టోర్నీలో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. నాకైతే అమెరికాకు వెళ్లి ఆడాలని ఉంది. అయితే, ఇప్పటివరకు ఆ దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం నేను అక్కడికి వెళ్లలేను. అందులో నేను చేసేదేం లేదు. అమెరికా ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. వాక్సినేషన్‌ తీసుకోని వాళ్లని అనుమతించాలా వద్దా అనేది వారి ఇష్టం’ అని జకోవిచ్‌ పేర్కొన్నాడు. చివరగా వాక్సినేషన్‌ తీసుకోవడం ఇష్టం లేదా అని అడిగిన ప్రశ్నకి ‘కచ్చితంగా లేద’ని స్పష్టం చేశాడు. అయితే, ఇదివరకే ఈ సెర్బియన్‌ స్టార్‌ వాక్సినేషన్‌పై తన అభిప్రాయం వెల్లడించాడు. తాను వాక్సిన్‌కు వ్యతిరేకం కాదని, కానీ.. తన శరీరంలోకి ఏది తీసుకోవాలో తీసుకోవద్దో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని