Published : 21 Mar 2022 17:20 IST

R Ashwin : క్రికెట్లో రికార్డులే అంతిమ లక్ష్యం కావు : రవిచంద్రన్‌ అశ్విన్‌

ఇంటర్నెట్ డెస్క్‌ : క్రికెట్లో రికార్డులనేవి ఆటగాడి కెరీర్‌లో భాగమే కానీ.. అవే అంతిమ లక్ష్యం కావని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో 15.08 సగటుతో 12 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. మాజీ క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ (434 వికెట్లు) రికార్డును అధిగమించాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌ (442 వికెట్లు)గా రికార్డు సృష్టించాడు. మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టుల్లో 619 వికెట్లతో భారత్‌ తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

‘రికార్డులను అధిగమించడం గొప్ప విషయం. క్రికెట్లో నేను సాధించిన ఘనతలను చూస్తే గర్వంగా అనిపిస్తుంది. రికార్డులను నేనేప్పుడూ కెరీర్‌లో భాగంగానే చూశాను. కానీ, అవే అంతిమ లక్ష్యంగా ఎప్పుడూ భావించలేదు. ప్రత్యేకించి గత రెండు మూడేళ్లుగా నా ప్రయాణం గొప్పగా సాగింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచిన భారత జట్టులో భాగం కావడం, మళ్లీ టీ20 క్రికెట్లో చోటు దక్కించుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది’ అని రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు.

‘ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్‌) చాలా కష్టమైన టోర్నమెంట్. ప్రతి సీజన్‌లోనూ ఆటగాళ్లకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. అందుకే, పరిస్థితులకు అనుగుణంగా.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రాణించేందుకు సిద్ధంగా ఉండాలి. వ్యక్తిగతంగా నా వరకైతే ఐపీఎల్‌లో ఆడటం ఎప్పుడూ ఎగ్జైటింగ్‌గానే ఉంటుంది. ప్రయోగాలు చేసేందుకు ఈ పొట్టి ఫార్మాట్‌ గొప్ప వేదికగా నిలుస్తోంది. ఫలితాలతో సంబంధం లేకుండా యువ ఆటగాళ్లలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతోంది. రాజస్థాన్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌పై భారీ అంచనాలున్నాయి. అతడెప్పుడూ ఓపెన్‌గా ఉంటాడు. తన ఆలోచనలను ఎప్పటికప్పుడూ ఆటగాళ్లతో పంచుకుంటుంటాడు. వికెట్‌ కీపర్‌గా అతడు ఆటను అన్ని కోణాల్లోనూ అర్థం చేసుకోగలడు. కెప్టెన్‌గా ఈ సీజన్‌లో మరింత గొప్పగా రాణిస్తాడనే నమ్మకం ఉంది’ అని అశ్విన్‌ అన్నాడు.

ఇటీవల ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో అశ్విన్‌ను.. రూ.5 కోట్ల భారీ ధరకు రాజస్థాన్‌ రాయల్స్ యాజమాన్యం దక్కించుకుంది. గతంలో అశ్విన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రైజింగ్ పుణె సూపర్‌ జెయింట్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్ల తరఫున ఆడిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని