Updated : 19 Jan 2022 06:36 IST

IND vs SA : కళ్లన్నీ కోహ్లీపైనే..

దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి వన్డే నేడు

మధ్యాహ్నం 2 గం।। నుంచి ప్రసారం

పార్ల్‌

కోహ్లి కెప్టెన్‌గా లేని టీమ్‌ ఇండియాను ఊహించడం కష్టమే. అతడు భారత క్రికెట్‌ను అంతలా ప్రభావితం చేశాడు. తనదైన శైలిలో జట్టును నడిపించాడు. అయితే ఇప్పుడు ఏ ఫార్మాట్లోనూ అతడు సారథి కాదు. ఏడేళ్లలో తొలిసారి కేవలం ఆటగాడిగా, మరొకరి నాయకత్వంలో బరిలోకి దిగుతున్నాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో తొలి వన్డే జరగనున్న నేపథ్యంలో కళ్లన్నీ విరాట్‌పైనే. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వ పటిమకు కూడా సిరీస్‌ పరీక్షే.

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య పరిమిత ఓవర్ల పోరాటానికి రంగం సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారమే తొలి వన్డే. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న ఉత్సాహంతో ఉండగా.. ఈ సిరీస్‌నైనా దక్కించుకోవాలని టీమ్‌ఇండియా ఆరాటపడుతోంది. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత కోహ్లి ఆడుతున్న తొలి మ్యాచ్‌ కావడం దీనిపై ఆసక్తిని మరింత పెంచుతోంది. అతడు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ను ప్రేక్షకులు మరింత నిశితంగా చూస్తారు. అతడు మైదానంలో ఎప్పటిలాగే దూకుడుగా కనిపిస్తాడా లేదా శాంతంగా ఉంటాడా అన్నది ఆసక్తికరం. ఇటీవల బీసీసీఐతో ఘర్షణ కోహ్లి ఆటను ప్రభావితం చేయదని, కొత్త ఇన్నింగ్స్‌ను మొదలెట్టి ఇక బ్యాటుతోనే మాట్లాడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. రెండేళ్లుగా శతకం లేని కోహ్లి.. ఈ సిరీస్‌తోనైనా సెంచరీల కరవును తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఈ సిరీస్‌లో రాహుల్‌ జట్టును ఎలా నడిపిస్తాడన్నది టెస్టులకు కొత్త కెప్టెన్‌ కోసం అన్వేషిస్తున్న సెలెక్టర్లను ప్రభావితం చేయనుంది.

ఇద్దరు స్పిన్నర్లతో..: కొత్త నాయకత్వం, కొత్త సహాయ సిబ్బందితో పోరుకు సిద్ధమవుతోన్న టీమ్‌ఇండియా.. ఈ సిరీస్‌ను గెలిచి టెస్టులు మిగిల్చిన నిరాశ నుంచి బయటపడాలనుకుంటోంది. భారత జట్టు చివరిసారి నిరుడు మార్చిలో పూర్తి స్థాయి జట్టుతో వన్డేలు (సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో) ఆడింది. ఆ తర్వాత పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగడం ఇదే. ద్వితీయ శ్రేణి పరిమిత ఓవర్ల జట్టు గత జులైలో శ్రీలంక వెళ్లిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు రాహుల్‌ మిడిల్‌ ఆర్డర్‌లో దిగాడు. అయితే రోహిత్‌ గైర్హాజరీలో తాను ఈ సిరీస్‌లో ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తానని అతడు ఇప్పటికే స్పష్టం చేశాడు. అంటే దేశవాళీలో అదరగొట్టిన రుతురాజ్‌ గైక్వాడ్‌ వన్డే అరంగేట్రం కోసం నిరీక్షించక తప్పదన్నమాట. ఇప్పటికే టీ20 జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ధావన్‌కు ఈ సిరీస్‌ చాలా ముఖ్యమైంది. విఫలమైతే స్థానం నిలబెట్టుకోవడం కష్టమే. కోహ్లి ఎప్పటిలాగే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. నాలుగో స్థానం కోసం సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ మధ్య పోటీ ఉంది. వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ అయిదో స్థానంలో దిగుతాడని భావిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ వన్డే అరంగేట్రం చేయనున్నాడు. అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడు. వెంకటేశ్‌ జట్టుకు ఆరో బౌలింగ్‌ ప్రత్యామ్నాయం కూడా. ఇద్దరు స్పిన్నర్లతో ఆడతామని కెప్టెన్‌ రాహుల్‌ సూచనప్రాయంగా చెప్పాడు. చాహల్‌, అశ్విన్‌ స్పిన్‌ బాధ్యతలు పంచుకునే అవకాశాలు మెండు. దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌లు బుమ్రాతో కలిసి పేస్‌ భారాన్ని మోయొచ్చు. గత పర్యటనలో 5-1తో వన్డే సిరీస్‌ను చేజిక్కించుకోవడం భారత్‌కు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

హుషారుగా దక్షిణాఫ్రికా..: ఓటమితో మొదలెట్టినా గొప్పగా పుంజుకుని టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకోవడంతో దక్షిణాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. టెస్టుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన బవుమా ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అదే విశ్వాసంతో కెప్టెన్‌గానూ జట్టును నడిపించాలనుకుంటున్నాడు. టెస్టుల నుంచి రిటైరైన వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డికాక్‌ ఈ సిరీస్‌ నుంచి కేవలం పరిమిత ఓవర్ల క్రికెటర్‌. అతడు రాణించడం దక్షిణాఫ్రికా అవకాశాలకు చాలా కీలకం. టెస్టుల్లో రాణించిన ఎడమచేతి వాటం పేసర్‌ మార్కో జాన్సన్‌ ఎక్స్‌ట్రా బౌన్స్‌, వైవిధ్యంతో వన్డేల్లోనూ భారత్‌కు సమస్యలు సృష్టించవచ్చని భావిస్తున్నారు.


పిచ్‌ ఎలా ఉందంటే..

మ్యాచ్‌ వేదిక అయినా బోలాండ్‌ పార్క్‌లో పిచ్‌ సాధారణంగా మందకొడిగా, నిర్జీవంగా ఉంటుంది. బౌండరీలు చిన్నగా ఉన్న నేపథ్యంలో భారీ స్కోర్లు నమోదవుతాయని భావిస్తున్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రాహుల్‌, ధావన్‌, కోహ్లి, సూర్యకుమార్‌, పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌, అశ్విన్‌, బుమ్రా, చాహల్‌.

దక్షిణాఫ్రికా: డికాక్‌, జానెమన్‌ మలన్‌, బవుమా, మార్‌క్రమ్‌, వాండర్‌డసెన్‌, మిల్లర్‌, ప్రిటోరియస్‌, ఫెలుక్వాయో, జాన్సన్‌, ఎంగిడి, శాంసి.


35

దక్షిణాఫ్రికాతో 84 వన్డేల్లో భారత్‌ సాధించిన విజయాలు. 46 ఓడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని