WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆ బంతులే ఆయుధాలు: స్మిత్‌

టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ దెబ్బతీయడానికి ఆసీస్‌ బౌలర్లు పాటించిన వ్యూహాన్ని స్మిత్‌ వెల్లడించాడు. దీంతో పాటు తాను అంచనా వేసినట్లే బంతులు పడటంతో శతకం పూర్తి చేసినట్లు తెలిపాడు.

Published : 09 Jun 2023 14:31 IST

ఇంటర్నెట్‌డెస్క్: డబ్ల్యూటీసీ ఫైనల్‌(WTC Final)లో ఆసీస్‌ బౌలర్లను అంచనా వేయడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. సీనియర్‌ బ్యాటర్‌ పుజారా, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గిల్‌ ఆఫ్‌-స్టంప్‌లను ఆస్ట్రేలియా బౌలర్లు గిరాటేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు బంతిని అంచనావేయడంలో విఫలమయ్యారనే విమర్శలొస్తున్నాయి. ఆసీస్‌ బౌలింగ్‌ వ్యూహంపై సీనియర్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌(Steve Smith) స్పందించాడు. ‘‘ఆఫ్‌ స్టంప్‌లను లక్ష్యంగా చేసుకొని వేసిన బంతులు ఈ మ్యాచ్‌లో కీలకమని అనుకుంటున్నాను. సహజంగానే వైవిధ్యభరితమైన బౌన్సులతో మేము ఈ విధంగా బౌలింగ్‌ చేశాం. బంతి వికెట్లకు దూరంగా వెళుతున్నా.. బౌన్స్‌ అయినా.. ఈ రెండూ కలిసి జరిగినా మీకు బయటవైపు ఎడ్జ్‌ తీసుకొని క్యాచ్‌లు వస్తాయి’’ అని పేర్కొన్నాడు.

ఇక 95 పరుగుల వద్ద రెండో రోజు మ్యాచ్‌ ప్రారంభించిన తర్వాత సిరాజ్‌ వరుసగా హాఫ్‌ వ్యాలీ బంతులు వేయడంపై స్మిత్‌ (Steve Smith)స్పందించాడు. మ్యాచ్‌ ప్రారంభంలో ఉన్న భయాలను పోగొట్టడానికి ఇవి ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ‘‘రెండో రోజు ఉదయం బ్యాటింగ్‌కు వెళ్లిన సమయంలో నా ప్యాడ్లపైకి రెండు హాఫ్‌ వ్యాలీలు వస్తే చాలనుకొన్నాను. అద్భుతమైన మైలు రాయిని దాటడం సంతోషకరంగా ఉంది. నా ఆటతీరుకు గర్వంగా ఉంది. నాకు అనుకూలమైన ఏరియాలో పడిన బంతులను బౌండరీలు దాటించాను. అదే సమయంలో బలమైన డిఫెన్స్‌ ఆడాను. హెడ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాను. అతడు మిడిల్‌ సెషన్‌లో అద్భుతంగా ఆడాడు’’ అని విశ్లేషించాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు