Rahul Dravid: ‘నేను స్పిన్‌ విభాగానికి కోచ్‌గా ఉంటానంటే ద్రవిడ్ వద్దన్నాడు’

తాను భారత జట్టు స్పిన్‌ విభాగానికి కోచ్‌గా సేవలందిస్తానని అడిగితే ప్రధాన కోచ్‌ ద్రవిడ్ (Rahul Dravid) అంగీకరించలేదని భారత మాజీ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ అన్నారు.

Published : 24 Mar 2023 20:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత మాజీ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌.. టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid)పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు స్పిన్‌ విభాగానికి కోచ్‌గా సేవలందిస్తానని అడిగితే ద్రవిడ్ అంగీకరించలేదని చెప్పాడు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏంటంటే.. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ ఓటమిపాలై సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. మూడో వన్డేలో భారత స్పిన్నర్లు విఫలమయ్యారు. కుల్‌దీప్‌ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టినా 50 పరుగులిచ్చాడు. అక్షర్‌ పటేల్ ఎనిమిది ఓవర్లు వేసి 57 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. జడేజా వికెట్లు పడగొట్టకున్నా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. ఆసీస్‌ స్పిన్నర్లు ఆడమ్‌ జంపా, అగర్‌ బౌలింగ్‌ని సమర్థంగా ఎదుర్కొలేక భారత బ్యాటర్లు పెవిలియన్‌ బాటపట్టారు.

ఈ నేపథ్యంలో ట్విటర్‌లో ఓ అభిమాని ‘‘కుల్‌దీప్‌ యాదవ్ బౌలింగ్ చేసినప్పుడు సరైన ఫీల్డింగ్‌ని సెట్ చేయలేదని నాకు అనిపించింది. ఆడమ్ జంపా బౌలింగ్ చేస్తున్నప్పుడు స్టీవ్ స్మిత్ అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. అస్టన్ అగర్ బౌలింగ్‌ చేసినప్పుడు కూడా అద్భుతమైన ఫీల్డ్ సెట్ చేశాడు. మీరేమంటారు..’ అని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్‌ని ట్యాగ్ చేశాడు. దీనికి ఆయన.. ‘టీమ్‌ఇండియా స్పిన్‌ విభాగానికి కోచ్‌గా ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తానని నేను రాహుల్‌ ద్రవిడ్‌తో చెప్పాను. ఆయన దానికి అంగీకరించలేదు. మీరు నా కంటే సీనియర్‌ అని ద్రవిడ్‌ నాతో అన్నారు’ అని పొంతన లేని సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని