Afghanistan: అఫ్గాన్‌ సంచలన విజయం.. నాడు భారత క్రికెటర్‌ చెప్పిన మాటలే నిజమయ్యాయా?

పొట్టి ప్రపంచకప్‌ సూపర్‌ 8లో ఆస్ట్రేలియాకు అఫ్గాన్‌ షాకిచ్చింది. ఈ సంచలన విజయంపైనే ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు.

Published : 24 Jun 2024 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌(T20 world cup 2024)లో పసికూన అఫ్గానిస్థాన్‌(Afghanistan) చరిత్ర సృష్టించింది. బలమైన ఆస్ట్రేలియాపై సూపర్‌ 8 మ్యాచ్‌(AUS vs AFG)లో సంచలన విజయాన్ని నమోదు చేసి సెమీస్‌ రేసులో నిలిచింది. ఏ ఫార్మాట్‌లోనైనా అఫ్గాన్‌కు ఆసీస్‌పై ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌ను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనదైన రోజున ఎంతటి పెద్ద టీమ్‌కైనా షాకిచ్చే సత్తా ఉన్న ఈ టీమ్‌.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఓ మాజీ భారత క్రికెటర్‌ ఉన్నాడు. అతడే అజయ్‌ జడేజా.

గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ జట్టుకు మెంటార్‌గా సేవలందించాడు మాజీ ఆల్‌రౌండర్‌ అజయ్‌ జడేజా. తనదైన వ్యూహాలతో కుర్రాళ్ల ఆటతీరును మెరుగుపరిచి.. పెద్ద జట్లకు సవాలు విసిరే స్థాయికి జట్టును చేర్చాడు. ఆ సమయంలో అతడు చేసిన వ్యాఖ్యలు.. తాజాగా ఆసీస్‌పై సంచలన విజయం అనంతరం మరోసారి వైరల్‌గా మారాయి.

‘‘కొన్ని దేశాలు వందేళ్లకుపైగా క్రికెట్‌ ఆడుతున్నాయి. కానీ.. అఫ్గాన్‌కు 15-20 ఏళ్ల అనుభవం మాత్రమే ఉంది. ఇదంతా జర్నీలో భాగమే. 2019 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తక్కువ మార్జిన్‌తో అఫ్గాన్‌ నుంచి ఓటమిని తప్పించుకున్నాయి. అఫ్గాన్‌ ఈ రోజు చిన్న టీం. ఏ రోజైతే.. బలమైన జట్లను ఓడిస్తుందో.. అది పెద్ద టీమ్‌గా మారుతుంది’’ అని జడేజా అప్పుడు అన్నాడు. ఆ జట్టు గత వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక, ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌లకు షాక్‌ ఇచ్చింది. ఈ పొట్టి ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలోనే న్యూజిలాండ్‌ను ఓడించింది. ఇలాంటి విజయాలు మరిన్ని వస్తాయి అని అతడు తాజాగా పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టే.. ఇప్పుడు ఆసీస్‌ను చిత్తు చేసి ఔరా అనిపించింది.

అఫ్గాన్‌ ఆటతీరును ఆసీస్‌ కెప్టెన్‌  మిచెల్‌ మార్ష్‌ కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. వారు తమపై అద్భుతంగా ఆడారని కొనియాడాడు. ఇక అఫ్గాన్‌.. సూపర్‌ 8 చివరి మ్యాచ్‌లో బంగ్లాతో తలపడనుంది. ఇందులో గెలిచి సెమీస్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. అయితే.. అది భారత్‌ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని