T20 World Cup: ఇంగ్లాండ్‌ చేతిలో ఒమన్‌ చిత్తు

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుచేసింది.

Published : 15 Jun 2024 02:48 IST

నార్త్‌ సౌండ్‌: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో ఒమన్‌ను చిత్తుచేసింది. ఇంగ్లాండ్‌ సంపూర్ణ ఆధిపత్యం సాగించిన ఈ మ్యాచ్‌ కేవలం 16.3 ఓవర్లలో పూర్తవడం విశేషం. మొదట బ్యాటింగ్‌ చేసిన ఒమన్‌ 13.2 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అడిల్‌ రషీద్‌ (4/11)తో పాటు జోఫ్రా ఆర్చర్‌ (3/12), మార్క్‌ వుడ్‌ (3/12) విజృంభించడంతో ఒమన్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం షోయబ్‌ ఖాన్‌ (11) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగలిగాడు. అనంతరం ఇంగ్లాండ్‌ మెరుపు వేగంతో లక్ష్య ఛేదన పూర్తిచేసింది. 3.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. కెప్టెన్‌ బట్లర్‌ (24 నాటౌట్‌; 8 బంతుల్లో 4×1, 1×6), ఫిల్‌ సాల్ట్‌ (12; 3 బంతుల్లో 2×6) సత్తాచాటారు. ఇక స్కాట్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవగా.. రెండో పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్‌ పరాజయం చవిచూసింది. తాజాగా ఒమన్‌పై గెలుపుతో ఇంగ్లాండ్‌ సూపర్‌ 8 రేసులోకి వచ్చింది. ఇంగ్లాండ్‌ 3 పాయింట్లతో గ్రూపులో మూడో స్థానంలో ఉండగా.. ఆసీస్‌ (6), స్కాట్లాండ్‌ (5) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

సంక్షిప్త స్కోర్లు...

ఒమన్‌: 47 (షోయబ్‌ ఖాన్‌ 11; ఆర్చర్‌ 3/12, వుడ్‌ 3/12, రషీద్‌ 4/11);

ఇంగ్లాండ్‌: 50/2 (బట్లర్‌ 24 నాటౌట్, బిలాల్‌ ఖాన్‌ 1/36, కలీముల్లా 1/10)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని