ఆ సమయంలో నా భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు : టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ 

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అతి దారుణమైన 9/11 దాడులు జరిగి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాడులు జరిగినప్పుడు అమెరికాలోనే ఉన్న భారత టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌..

Published : 11 Sep 2021 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్కు : అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే అతి దారుణమైన 9/11 దాడులు జరిగి నేటికి రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దాడులు జరిగినప్పుడు అమెరికాలోనే ఉన్న భారత టెన్నిస్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ తన అనుభవాలను పంచుకొన్నారు. ‘దాడులు జరిగే కంటే కొద్ది రోజులు ముందే నేను యూఎస్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు మరో ఆటగాడు మహేశ్‌ భూపతితో కలిసి అమెరికా వెళ్లాను. మొదటి రౌండ్‌లోనే మేం ఓడిపోయాం. అయితే, అదే నెల చివర్లో డేవిస్‌ కప్‌ కూడా ఉండటంతో అమెరికాలోనే ఉండిపోయాం. అదే సమయంలో ట్విన్‌ టవర్స్‌పై విమాన దాడులు జరిగాయి. దీంతో ఆటగాళ్లు చాలా గందరగోళానికి గురయ్యారు. దాడి జరిగే కంటే ఒక రోజు ముందు నేను ట్విన్‌ టవర్స్‌లోనే ఉన్నాను. అక్కడి నుంచి డేవిస్‌ కప్‌లో పాల్గొనేందుకు కారులో విమానాశ్రయానికి వెళ్తుంటే.. ట్విన్‌ టవర్స్‌పై దాడి గురించి తెలిసింది. మొదట దాన్ని విమాన ప్రమాదమనుకున్నా.  అయితే, రెండో విమానం కూడా టవర్స్‌పైకి దూసుకురావడంతో ఎవరో ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడేనని అర్థమైంది. ఆ సమయంలో నా కోచ్‌, స్నేహితులు న్యూయార్క్‌లోనే ఉన్నారు. దాంతో వెంటనే వారికి ఫోన్‌ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నాను. ట్విన్ టవర్స్‌పై దాడి కారణంగా విమానాలు రద్దు కావడంతో కారు అద్దెకు తీసుకుని ఫ్లోరిడా వెళ్లిపోయాను’ అని పేస్‌ పేర్కొన్నాడు. 

‘ఆ సమయంలో నా భవిష్యత్తు ఏంటో అర్థం కాలేదు. విమాన ప్రయాణాలపై చాలా ఆంక్షలు ఉండేవి. సెప్టెంబరు 21-23 మధ్య జరగాల్సిన డెవిస్ కప్‌ టోర్నీని అక్టోబరు 12-14 మధ్య నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆటకు సంబంధించిన సామగ్రిని కూడా వెంట తీసుకెళ్లనిచ్చేవారు కాదు. ముఖ్యంగా ప్రొఫెషనల్‌ షూటర్లు ఆయుధాలు, టెన్నిస్‌ ఆటగాళ్లు రాకెట్లు తీసుకెళ్లడానికి భద్రతాపరంగా చాలా సమస్యలు ఎదురయ్యేవి. భద్రతాధికారులు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే విమాన ప్రయాణాలకు అనుమతించేవారు. ఎలాగోలా కష్టపడి నార్త్‌ కరోలినా చేరుకున్నాం. అక్కడ అమెరికా ఆటగాళ్లు మాకు ఘనంగా స్వాగతం పలికారు. టెన్నిస్‌ కోర్టంతా ప్రేక్షకులతో నిండిపోయింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు మేమంతా ట్విన్‌ టవర్స్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళి అర్పించాం. అనంతరం ప్రారంభమైన టోర్నీలో అమెరికా ఆటగాళ్లు రోడిక్‌, బ్లేక్‌ జోడి టైటిల్‌ గెలుచుకున్నారు’ అని లియాండర్ పేస్‌ చెప్పాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని