Babar Azam: 11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్‌గా విఫలమయ్యాం: బాబర్ అజామ్‌

పాకిస్థాన్‌ ఓటమికి కారణాలను ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్‌ వెల్లడించాడు. అభిమానులను తీవ్ర నిరాశపరిచినట్లు అంగీకరించాడు.

Published : 17 Jun 2024 13:20 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) లీగ్‌ స్టేజ్‌ నుంచే పాకిస్థాన్‌ ఇంటిముఖం పట్టింది. అయినా తన చివరి మ్యాచ్‌లో విజయం సాధించడం గమనార్హం. సూపర్-8కి అర్హత సాధించని పాక్‌ నామమాత్రమైన పోరులో ఐర్లాండ్‌ను ఓడించింది. ఈ టోర్నీలో తమ ఆటతీరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిందని.. బ్యాటింగ్‌లో సరైన ప్రదర్శన చేయలేదని పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌ (Babar Azam) అంగీకరించాడు. మరీ ముఖ్యంగా భారత్, యూఎస్‌ఏతో జరిగిన మ్యాచుల్లో జట్టుగా తాము విఫలం కావడమే పొట్టి కప్‌ నుంచి నిష్క్రమణకు కారణమని వ్యాఖ్యానించాడు.

‘‘యూఎస్‌ఏ పిచ్‌ కండీషన్లకు మా బౌలింగ్‌ సరిగ్గా సరిపోయింది. బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు. కానీ, మా బ్యాటర్ల తప్పిదాలతో యూఎస్‌ఏ, భారత్ మ్యాచుల్లో ఓడిపోయాం. వికెట్లను కోల్పోతున్నప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మా ఆటతో అభిమానులను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశామని ఇంతకుముందే చెప్పా. జట్టుగా మేం ఆడలేకపోయాం. వ్యక్తిగత ప్రదర్శన కంటే టీమ్‌గా ఓడిపోయాం. కేవలం కెప్టెన్సీ వల్ల విజయం సాధ్యం కాదు. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. వారి ఆటను కూడా నేను ఆడలేను కదా. ఇది ప్రపంచమంతా చూసే వరల్డ్‌ కప్‌. ప్రతిఒక్కరూ తమదైన పాత్ర పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. మా ప్రణాళికలను సరిగ్గా అమలుచేయలేకపోయాం. తప్పకుండా ఓటమిపై సమీక్షించుకుంటాం. ఏమైనా మార్పులు అవసరమైతే చేసుకుంటాం. 

మెగా టోర్నీని చివరికి విజయంతో ముగించాం. ఐర్లాండ్‌ను తక్కువగా అంచనా వేయలేదు. త్వరగా వికెట్లు తీయడంతో వారిపై ఆధిపత్యం సాధించాం. కానీ, బ్యాటింగ్‌లో కాస్త తడబాటుకు గురయ్యాం. చివరికి గెలవడంతో ఆనందంగా ఉంది. తప్పకుండా మా ఓటములపై సమీక్షించుకుంటాం. నేను కెప్టెన్సీ వదిలిపెట్టను. పీసీబీ ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే’’ అని బాబర్ తెలిపాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 18.5 ఓవర్లలో 7 వికెట్లను నష్టపోయి 111 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్‌ అజామ్‌ (32*) చివరివరకూ క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని