Saurabh Netrawalkar: మ్యాచ్‌ పూర్తవగానే సాఫ్ట్‌వేర్‌ పని..

భారత సంతతికి చెందిన సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్‌. పాకిస్థాన్‌పై సూపర్‌ ఓవర్లో యుఎస్‌ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం.

Published : 15 Jun 2024 02:45 IST

దిల్లీ: భారత సంతతికి చెందిన సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్‌. పాకిస్థాన్‌పై సూపర్‌ ఓవర్లో యుఎస్‌ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. భారత్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి, రోహిత్‌ వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇలా మైదానంలో బౌలింగ్‌తో సత్తాచాటుతున్న సౌరభ్‌ మ్యాచ్‌ పూర్తయ్యాక హోటల్‌ గదికి వెళ్లి ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుని తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటాడు. ఈ విషయాన్ని అతని సోదరి నిధి వెల్లడించింది. ముంబయిలో పుట్టిన సౌరభ్‌ ప్రస్తుతం ఒరాకిల్‌లో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఈ టీ20 ప్రపంచకప్‌ కోసం అతను సెలవు తీసుకున్నాడు. కానీ అమెరికా ఆడే మిగతా మ్యాచ్‌ల సమయంలో, ఒకవేళ ఇప్పుడు అవసరమైనా సౌరభ్‌ హోటల్‌ గది నుంచి పని చేస్తాడని నిధి తెలిపింది. ‘‘తనకు మద్దతుగా నిలిచే వ్యక్తులు ఉండటం అతని (సౌరభ్‌) అదృష్టం. క్రికెట్‌ ఆడనప్పుడు తన ఉద్యోగ బాధ్యతలను వంద శాతం నిర్వర్తించాలని అతనికి తెలుసు. అందుకే అతను ఎక్కడికి వెళ్లినా ల్యాప్‌టాప్‌ తీసుకెళ్తాడు. ఎక్కడి నుంచైనా పని చేసే స్వేచ్ఛ అతనికి ఉంది. భారత్‌కు వచ్చినా ల్యాప్‌టాప్‌ తీసుకొస్తాడు. ఇక్కడి నుంచి పని చేస్తాడు. అలాగే మ్యాచ్‌ పూర్తి కాగానే హోటల్‌కు వెళ్లాక పనిలో మునిగిపోతాడు. ముంబయి వాసుల్లో ఇలాంటి సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది. గతంలోనూ ఆట, చదువును సౌరభ్‌ చక్కగా సమన్వయం చేసుకునేవాడు’’ అని నిధి తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని