Virat Kohli: విరాట్‌ ఒకసారి పరుగుల రుచి మరిగితే.. ఏదైనా చేయగలడు: ఉతప్ప

విరాట్‌ బ్యాటింగ్‌ ఒక్కసారి జోరందుకుంటే ఇక టీమ్‌ ఇండియా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఆసీస్‌తో మ్యాచ్‌లో అతడి బ్యాట్‌ నుంచి కళాత్మక ఇన్నింగ్స్‌ జాలువారుతుందని మాజీలు ఆశిస్తున్నారు.

Updated : 24 Jun 2024 15:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పొట్టి ప్రపంచకప్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో తడబడినట్లు అనిపించిన కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కుదురుకొన్నట్లు కనిపించాడు. నెమ్మదిగా మొదలుపెట్టినా.. జోరైన ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో నేడు ఆసీస్‌పై జరగనున్న సూపర్‌ 8 మ్యాచ్‌లో అతడు కచ్చితంగా భారీ ఇన్నింగ్స్‌ ఆడే అవకాశం ఉందని వెటరన్‌ ఆటగాళ్లు అంచనా వేస్తున్నారు. సెయింట్‌ లూసియాలో నేడు జరగనున్న మ్యాచ్‌ టీమ్‌ ఇండియాకు అత్యంత కీలకంగా మారింది. 

ఈ టోర్నమెంట్‌లో విరాట్‌ ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌ చేసి 66 పరుగులు మాత్రమే చేశాడు. వీటిల్లో 61 రన్స్‌ చివరి రెండు ఇన్నింగ్సుల్లో వచ్చినవే. వీటిల్లో అతడి స్ట్రైక్‌ రేటు 108 మాత్రమే. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన తర్వాత పొట్టి ప్రపంచకప్‌ బరిలోకి దిగిన విరాట్‌ గ్రూప్‌ దశలో మాత్రం కొంత ఇబ్బందిపడ్డాడు. తాజాగా అతడి బ్యాటింగ్‌ మెల్లగా గాడినపడిందని జట్టు వెటరన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌, మాజీ కీపర్‌ రాబిన్‌ ఉతప్ప అభిప్రాయపడ్డారు. విరాట్‌ బ్యాట్‌ నుంచి ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో ఒక్క ఆఫ్‌ సెంచరీ కొట్టినా.. జట్టు సునాయాసంగా సెమీస్‌కు చేరుకొంటుందని వారు చెబుతున్నారు. 

‘‘అత్యుత్తమ జట్టుగా మారడానికి టీమ్‌ ఇండియాకు ఉపకరించే అంశం ఒకటుంది. అదే విరాట్‌ నుంచి ఓ బలమైన ఇన్నింగ్స్‌. ఈ టోర్నమెంట్‌ జరుగుతున్న తీరు చూస్తే.. 120-125 స్ట్రైక్‌ రేట్‌తో అయినా ఇబ్బంది లేదుగానీ.. అజేయంగా 60-70 పరుగులు సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి అతడు పరుగుల రుచి మరిగితే.. ఏమైనా సాధించగలడు. నా మటుకు నేను సెమీస్‌కు ముందు ఒక్కసారి అతడు 150 స్ట్రైక్‌ రేటుతో ఆడాలని కోరుకుంటున్నాను’’ అని రాబిన్‌ ఉతప్ప పేర్కొన్నాడు.

మరోవైపు రోహిత్‌ ఆటతీరును రాబిన్‌ సమర్థించాడు. టాప్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడాలన్న అతడి వైఖరి సరైందేనని పేర్కొన్నాడు. ‘‘రోహిత్‌ తన బ్యాటింగ్‌ తీరుపై స్పష్టంగా ఉన్నాడు. అతడు అనుకొన్నట్లే ఆటను కొనసాగించాలి. జట్టుకు అదే మేలు చేస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో రోహిత్‌ 24 సగటు, 125 స్ట్రైక్‌ రేటుతో 99 పరుగులు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్‌ 52. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని