Virat Kohli: ఫైనల్లో ఓడితే ప్రపంచం ఆగిపోదు!

కేవలం ఐదు రోజుల్లోని ఆట నిజమైన టీమ్‌ఇండియాను ప్రతిబింబించదని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మరో సాధారణ మ్యాచ్‌గా పేర్కొన్నాడు. గత నాలుగైదేళ్లలో తమ ఆటను అర్థం చేసుకున్న వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారని వెల్లడించాడు....

Published : 19 Jun 2021 01:15 IST

ఐదు రోజుల ఆట టీమ్‌ఇండియాను ప్రతిబింబించదు

సౌథాంప్టన్‌: కేవలం ఐదు రోజుల్లోని ఆట నిజమైన టీమ్‌ఇండియాను ప్రతిబింబించదని సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మరో సాధారణ మ్యాచ్‌ అని పేర్కొన్నాడు. గత నాలుగైదేళ్లలో తమ ఆటను అర్థం చేసుకున్న వారెవరైనా ఇలాగే ఆలోచిస్తారని వెల్లడించాడు. ఫైనల్‌కు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

‘చరిత్రను మీరోసారి పరిశీలించండి. ఎందరో ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు. దానిని బట్టి ఇదొక క్రీడ అని అర్థమవుతుంది. మేమీ ఫైనల్‌ గెలిచినా.. ఓడినా..  మా క్రికెట్‌ ఇక్కడితో ఆగిపోదు. అందుకే ఈ ఫైనల్‌ను మరీ ప్రత్యేకంగా చూడటం లేదు. ఇదో మరో మ్యాచ్‌ అంతే. బయటవాళ్లు మాత్రమే అతిగా ఆత్రుత పడతారు. చావోరేవో అన్నట్టు భావిస్తారు’ అని కోహ్లీ అన్నాడు.

‘మేం కొన్నేళ్లుగా అద్భుతంగా ఆడుతున్నాం. ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా దానినే ఇకపై కొనసాగిస్తాం. మేం 2011 ప్రపంచకప్‌ గెలిచాం. జీవితంలాగే ఆ తర్వాతా క్రికెట్‌ సాగుతోంది. గెలుపోటములను ఒకేలా తీసుకోవాలి. నిజంగా ఇది ఆస్వాదించాల్సిన సందర్భమే. కానీ యువకులుగా మేం అరంగేట్రం చేసిన మ్యాచ్‌ కన్నా ఇది మరీ ముఖ్యమైందైతే కాదు’ అని విరాట్‌ తెలిపాడు.

‘వాతావరణం మా జట్టు కూర్పును మరీ మార్చలేదు. మేం అన్ని విభాగాలను కవర్‌ చేశాం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాలు సరిచూసుకున్నాం. పటిష్ఠమైన జట్టునే బరిలోకి దింపుతున్నాం. ఏం చేయాలో ఏం చేయొద్దో స్పష్టంగా నిర్ణయించుకున్నాం. మా కుర్రాళ్లు అదరగొడుతున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించారు. ఈ ఫైనల్‌ చేరుకొనేందుకు మేమెంత కష్టపడ్డామో అందరికీ తెలుసు. జట్టుగా మేమేంటో మాకు తెలుసు’ అని విరాట్‌ వెల్లడించాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పద్ధతిని మధ్యలో మార్చడం సరికాదని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రపంచమంతా స్తంభించినప్పుడు, ఆటగాళ్లంతా ఇళ్లలో ఉన్నప్పుడు మార్చడమేంటని ప్రశ్నించాడు. కనీసం ఇకనైనా రాత్రికి రాత్రే ఏ మార్పులూ చేయొద్దని సూచించాడు. పాయింట్ల విధానం మార్చాక ఫైనల్‌ చేరుకొనేందుకు ఎంతో కష్టపడ్డామని వివరించాడు. అంకితభావం, పట్టుదలతో ఆడి ఈ స్థితికి చేరుకున్నామని స్పష్టం చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని