Mirabai Chanu: శిష్యురాలి విజయం.. కుంజరాణి దేవి ఆనందం..

టోక్యో ఒలింపిక్స్‌ మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చాను విజయం పట్ల ఆమె గురువు కుంజరాణి దేవి (53) హర్షం వ్యక్తం చేశారు. మీరా దేశం గర్వపడేలా చేసిందని ప్రశంసించారు....

Published : 24 Jul 2021 20:31 IST

దిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన మీరాబాయి చాను విజయం పట్ల ఆమె గురువు కుంజరాణి దేవి (53) హర్షం వ్యక్తం చేశారు. మీరా దేశం గర్వపడేలా చేసిందని ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏడుసార్లు రజతం గెలిచిన కుంజరాణి దేవి ఎందరో యువ వెయిట్‌ లిఫ్టర్లకు ఆదర్శప్రాయం. అయితే ఒలింపిక్స్‌ పతకం ఆమెకు కలగానే మిగిలిపోయింది. అయితే ఆ కలను తన శిష్యురాలు నిజం చేయడంతో కుంజరాణి గర్వం వ్యక్తం చేశారు. గురువుగా చానులోని చిన్నచిన్న లోపాలను మాత్రమే సవరించానని, ఎంతో కష్టపడుతూ.. తనను తాను రాటుదేల్చుకుంటూ ముందుకెళ్లిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీరాబాయి గురించి ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘2011లో జరిగిన జూనియర్‌ నేషనల్‌ క్యాంప్‌లో మీరాబాయిని మొదటిసారి చూశా. అప్పుడే నేను ఆమెకు మొదటిసారి కోచ్‌గా వ్యవహరించా. ప్రతిభతోపాటు దృఢ సంకల్పం కలగలిసిన వ్యక్తి మీరా. అందరు అథ్లెట్ల కంటే ఆమె ఎంతో భిన్నం. కోచ్‌లు ఏది చెబితే దాన్ని తూచా తప్పకుండా పాటించేది. ఆమెలోని చిన్న లోపాలను మాత్రమే సవరించేందుకు నేను సహాయపడ్డా. ఒలింపిక్‌ ఛాంపియన్‌గా ఎదగాలన్నా.. అర్జున, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న లాంటి అవార్డులు సాధించాలన్నా ఎంతో కష్టపడాలని ఆమెకు సూచించేదాన్ని. చాను ఆటలోని నాణ్యతే ఈ రోజు ఆమె ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు కారణం’ అని పేర్కొన్నారు.

2017 రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోవడంతో నిరాశకు గురైన చాను తిరిగి అంతే వేగంగా పుంజుకుందని  కుంజరాణి తెలిపారు.‘ఆమె నా దగ్గర 2015 వరకు శిక్షణ తీసుకుంది. రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో ఆమె వెంట ఉన్నా. తన విజయాలను దగ్గరుండి చూశాను. చాను పోటీల్లో బిజీ కావడంతో 2018 నుంచి తనను కలవకపోయినా.. ఆమెను ఆశీర్వదిస్తూనే ఉండేదాన్ని. ఆమె సాధించిన ఈ విజయంలో కొంతమేర అయినా నా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నా’ అని తెలిపారు.

‘రైల్వేలో విధులు నిర్వహిస్తూ.. వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పాలుపంచుకుంటూనే చాను తన కుటుంబాన్ని పోషించింది. తన కాళ్లమీద తాను నిలబడి కుటుంబ బాగోగుల్ని చూసుకొంది. తన జీవితం కూడా నా జీవితంలాగే ఉండేది. అందుకే తన మీద కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టేదాన్ని. ఈ రోజు భారత దేశ గౌరవాన్ని తన భుజాల మీద ఎత్తుకొంది. కొవిడ్‌ కారణంగా నవ్వడాన్ని మర్చిపోయిన ప్రస్తుత తరుణంలో.. ఒక యువతి వల్ల దేశమంతా హర్షిస్తోంది. ఇందుకు ఎంతో గర్వంగా ఉంది.’ అని కుంజరాణి దేవి ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని