Ravi Shastri : ప్రపంచ క్రికెట్లో అతడు అత్యుత్తమ ఆటగాడు : రవిశాస్త్రి

టీ20 మెగా టోర్నీలో గుజరాత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌పై టీమ్‌ఇండియా మాజీ హెడ్‌ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు...

Published : 05 Apr 2022 02:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీ20 మెగా టోర్నీలో గుజరాత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న యువ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌పై టీమ్‌ఇండియా మాజీ హెడ్‌ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతమున్న ప్రపంచ క్రికెటర్లలో అతడు అత్యుత్తమ ఆటగాడని పేర్కొన్నాడు. ప్రస్తుత సీజన్‌ ఆరంభంలో లఖ్‌నవూ జట్టుతో జరిగిన తొలి మ్యాచులో శుభ్‌మన్‌ డకౌటైన విషయం తెలిసిందే. అయితే, శనివారం దిల్లీతో జరిగిన రెండో మ్యాచులో అతడు గొప్పగా పుంజుకున్నాడు. శుభ్‌మన్‌ (84) పరుగులతో రాణించి గుజరాత్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

‘శుభ్‌మన్‌లో గొప్ప నైపుణ్యం ఉంది. ప్రస్తుత తరం ప్రపంచ స్థాయి క్రికెటర్లలో అతడు అత్యుత్తమ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే చాలా సులభంగా పరుగులు చేయగలడు. దాంతో పాటు అతడి షాట్‌ సెలెక్షన్‌, స్ట్రైక్‌ రోటేట్‌ చేసే విధానం చాలా బాగుంటుంది. శుభ్‌మన్‌ దిల్లీతో జరిగిన మ్యాచులో 46 బంతులు ఎదుర్కొంటే.. అందులో 6 బంతులు మాత్రమే డాట్ అయ్యాయి. చెత్త బంతులను వదిలేస్తూ.. షార్ట్‌ పిచ్‌ బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం అతడు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు’ అని రవిశాస్త్రి చెప్పాడు.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 171/6 స్కోరు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన దిల్లీ 157/9 పరుగులకే పరిమితమైంది. దీంతో గుజరాత్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని