Saurabh Netravalkar: అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్‌ సంస్థకు విజ్ఞప్తులు

అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్‌ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

Published : 17 Jun 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో అమెరికాను ‘సూపర్‌ 8’కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన సౌరభ్‌ నేత్రావల్కర్‌(Saurabh Netravalkar) గురించే ఇప్పుడు అంతటా చర్చ. ఈ ప్రవాస భారతీయ ఐటీ ఇంజినీర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గ్రూప్‌ దశలో పాకిస్థాన్‌పై అద్భుత సూపర్‌ ఓవర్‌ వేసి యూఎస్‌ఏకు చిరస్మరణీయ విజయాన్ని అందించడం.. ఆ తర్వాత మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ వికెట్లు తీయడంతో నేత్రావల్కర్‌ ఒక్కసారిగా అక్కడ హీరోగా మారిపోయాడు.

ఒరాకిల్‌ ఏఐ ఇంజినీర్‌ అయిన నేత్రావల్కర్‌ను పలువురు క్రికెటర్లతోపాటు.. సహోద్యోగులు కూడా అభినందిస్తున్నారు. అతడి ఆటతీరును మెచ్చుకుంటూ ఒరాకిల్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. ‘టీ20 ప్రపంచకప్‌లో అమెరికా చరిత్ర సృష్టిస్తోంది. మన ఏఐ ఇంజీనిర్‌, క్రికెట్‌ స్టార్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌ ఆట పట్ల ఎంతో గర్వంగా ఉంది’’ అని ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘నా టెక్‌ కెరీర్‌తోపాటు క్రికెట్‌ అభిరుచిని కొనసాగించేందుకు మద్దతునిచ్చిన ఒరాకిల్‌కు కృతజ్ఞతలు’’ అంటూ నేత్రావల్కర్‌ కూడా వెంటనే స్పందించాడు.

సామాజిక మాధ్యమాల్లో కొనసాగిన ఈ చర్చ ఆ తర్వాత వైరల్‌గా మారింది. పలువురు టెకీలు అతడి అద్భుత ప్రదర్శనను మెచ్చుకుంటూ.. ఒరాకిల్‌ సంస్థకు విజ్ఞప్తులు కూడా పంపారు. అతడితో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయించకూడదని, సెలవులు పొడిగించాలని ఒకరు కోరితే.. మరొకరు అతడి జీతాన్ని 60 శాతం పెంచాలని అడిగారు. అతడికి అన్ని డెడ్‌లైన్ల నుంచి విముక్తి కలిగించాలని.. క్రికెట్‌పైనే దృషి పెట్టేలా చేయాలని కంపెనీకి మరికొందరు సూచించారు.

మైదానంలో బౌలింగ్‌తో సత్తాచాటుతున్న సౌరభ్‌ మ్యాచ్‌ పూర్తయ్యాక హోటల్‌ గదికి వెళ్లి ల్యాప్‌టాప్‌ ముందు కూర్చుని తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటాడని అతని సోదరి నిధి వెల్లడించిన విషయం తెలిసిందే. నేత్రావల్కర్‌ ఈ టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని