
Yuzuvendra Chahal: రోహిత్ భాయ్‌తో నా బంధం ప్రత్యేకమైనది : యుజువేంద్ర చాహల్
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ జట్టుతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న రోహిత్ శర్మతో తనకున్న బంధం ప్రత్యేకమైనదని టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ అన్నాడు. అందుకే మైదానంలో తన వ్యూహాలను స్వేచ్ఛగా పంచుకోగలుగుతానని పేర్కొన్నాడు. ‘రోహిత్ భాయ్‌తో నా బంధం ప్రత్యేకమైనది. రితిక (రోహిత్ భార్య) నన్ను తమ్ముడిలా చూసుకుంటుంది. మేమంతా ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఉంటాం. అందరం కలిసి అప్పుడప్పుడూ డిన్నర్‌కి వెళ్తుంటాం. మా ఇద్దరి మధ్య బంధం క్రికెట్‌కు మించినది. అందుకే మైదానంలో ఆడుతున్నప్పుడు కూడా నా వ్యూహాలను రోహిత్‌తో స్వేచ్ఛగా పంచుకోగలుతాను’ అని చాహల్ పేర్కొన్నాడు.
అయితే, ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక కాకపోవడం కొంచెం నిరాశకు గురి చేసిందని చాహల్ చెప్పాడు. ‘చాలా ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్నా.. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం కాస్త నిరాశ కలిగించింది. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసినా.. టీమిండియా తరఫున పొట్టి ఫార్మాట్లో చోటు దక్కకపోవడంతో షాక్‌కి గురయ్యాను. రెండు, మూడు రోజులు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఆ సమయంలో నా కోచ్‌ల దగ్గరికి వెళ్లి మాట్లాడాను. నా భార్య, కుటుంబం కూడా చాలా అండగా నిలిచింది. నా అభిమానులు కూడా నన్ను ప్రోత్సహిస్తూ పోస్టులు పెట్టేవారు. ఆ సమయంలో అవే కొంచెం ఊరటనిచ్చాయి’ అని చాహల్ అన్నాడు.
► Read latest Sports News and Telugu News