Pakistan: పాక్‌ జట్టుపై ఫిక్సింగ్‌ ఆరోపణలు.. పీసీబీ ఏమందంటే..!

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో పాక్‌ జట్టు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పీసీబీ వర్గాలు స్పందించాయి.

Published : 22 Jun 2024 00:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో (T20 WorldCup) పాక్‌ జట్టు (Pak Cricket Team) ఘోరంగా విఫలమైంది. సూపర్‌-8కైనా చేరలేకపోయింది. పసికూన అమెరికా చేతిలోనూ ఓడిపోయింది. దీంతో బాబర్‌ అజాం (Babar Azam) సారథ్యంలోని జట్టు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాక్‌ సీనియర్‌ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) స్పందించింది. జట్టు సభ్యుల్ని వెనకేసుకొచ్చింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని వెల్లడిచింది. ఆరోపణలు చేసిన వారు ఆధారాలతో రావాలని కోరింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలితే జట్టు సభ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు పీసీబీ వర్గాలు వెల్లడించాయి.

పాక్‌ బోర్డు నుంచి మాత్రం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ‘‘విమర్శలు కొంత పరిధిలో ఆమోదయోగ్యమే. నైపుణ్యాలను మెరుగు పరచుకునేందుకు సహకరిస్తాయి. కానీ, ఓటమి పాలైనంత మాత్రాన ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపణలు చేయడం సహేతుకం కాదు’’ అని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు అక్కడి మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. నిరాధార ఆరోపణలు చేసిన వారికి లీగల్‌ నోటీసులు పంపించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ తగిన ఆధారాలు సమర్పించకపోతే పరువు నష్టం దావా వేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అక్కడి నిబంధనల ప్రకారం ఈ తరహా కేసుల్లో గరిష్ఠంగా 6 నెలల్లోగా తీర్పు వెలువడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని