IND vs PAK : ఈ ఆల్‌రౌండరే.. భారత్‌ - పాక్‌ జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం!

మెగా టోర్నీల్లో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఇటు బ్యాటింగ్‌ సహా బౌలింగ్‌లో రాణించి జట్టు విజయం కోసం..

Updated : 14 Aug 2022 19:20 IST

పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు ఆకిబ్ జావెద్

ఇంటర్నెట్ డెస్క్‌: మెగా టోర్నీల్లో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఇటు బ్యాటింగ్‌ సహా బౌలింగ్‌లో రాణించి జట్టు విజయం కోసం కష్టపడతారు. మరి అలాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్లు ఉన్న టీమ్‌లు ఎలాంటి ఆందోళన లేకుండా ఉంటాయి. ప్రస్తుతం టీమ్‌ఇండియాకు హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్‌ పటేల్ వంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. అయితే పాండ్య మినహా మిగతావారంతా స్పిన్నర్లు. పాండ్య ఒక్కడే ఫాస్ట్‌బౌలింగ్‌ వేయగలిగే బౌలర్‌. అందుకే పేస్‌తో కూడిన ఆల్‌రౌండర్‌ ఉంటే ఆ జట్టు సమతూకంగా ఉంటుందని మాజీలు చెబుతుంటారు. హార్దిక్ వంటి ఆటగాడు లేకపోవడమే తమ జట్టు ప్రధాన లోపమని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ ఆకిబ్ జావెద్ అన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 28న భారత్, పాక్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

‘‘కెప్టెన్‌ బాబర్ అజామ్‌ నాయకత్వంలోని పాక్‌ ఎంతో అనుభవం సంపాదించింది. అయితే దాయాది జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం బ్యాటింగ్‌ లైనప్‌. ఇప్పుడు భారత్‌ కూడా భారీగా టీ20లను ఆడి అనుభవం పెంచుకుంది. రోహిత్ వంటి ఆటగాడు మ్యాచ్‌ను పూర్తిగా మార్చేయగలడు. ఇక భారత్‌-పాక్‌ మిడిలార్డర్‌కు వస్తే ఆల్‌రౌండర్‌ కీలక పాత్ర పోషిస్తాడు. మరీ ముఖ్యంగా టీమ్‌ఇండియా ఆటగాడు హార్దిక్‌ పాండ్య వంటి సామర్థ్యం ఆల్‌రౌండర్‌ పాకిస్థాన్‌కు లేడనే చెప్పాలి’’ అని జావెద్ వివరించాడు. గత టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌ ఓడిపోయిన విషయం తెలిసిందే. దాదాపు 28 ఏళ్ల రికార్డును బాబర్‌ నాయకత్వంలోని పాక్‌ బ్రేక్‌ చేసింది. ఇంకో రెండు వారాల్లో మరోసారి దాయాదుల పోరు జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని