IND vs PAK:  ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెబుతున్నా: వకార్‌

పశ్చాత్తాపం వ్యక్తం చేసిన పాక్‌ మాజీ క్రికెటర్‌ వకార్ యూనిస్‌

Published : 28 Oct 2021 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు వకార్‌ యూనిస్‌ తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ట్వీట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. భారత్‌తో మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పాక్‌ కీపర్‌, బ్యాటర్‌ రిజ్వాన్‌ డ్రింక్స్‌ విరామం సందర్భంగా నమాజ్‌ చేశాడు. దీనిపై వకార్‌ ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ సందర్భంగా హిందువుల మధ్యలో రిజ్వాన్‌ నమాజ్‌ చేయడం నన్నెంతో ఆకట్టుకుంది’’ అని వ్యాఖ్యానించాడు. దీనిపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వకార్‌ ట్విటర్‌లో క్షమాపణలు తెలిపాడు. ‘‘ క్షణికావేశంలో చేసిన వ్యాఖ్యలు అవి. ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావు. ఎవరి మనోభావాలను గాయపరచాలని అలా చెప్పలేదు. ఈ వ్యాఖ్యలు కావాలని చేసినవి కావు. ఎవరి సెంటిమెంట్స్‌ను హర్ట్‌ చేయాలని కాదు. ప్రజలనంతా ఏకం చేసేవి క్రీడలు. మతం, రంగు, జాతి వంటి వాటికి ఆటల్లో చోటు లేదు’’ అని ట్వీట్‌ చేశాడు. 

భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ అంటేనే భావోద్వేగాలతో కూడుకున్నది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాపై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (57), రిషభ్‌ పంత్‌ (39) రాణించారు. అయితే, లక్ష్య ఛేదనలో మహమ్మద్‌ రిజ్వాన్‌ (79*), బాబర్ అజామ్ (68*) అర్ధశతకాలు బాదేశారు. దీంతో వికెట్‌ నష్టపోకుండా 17.5 ఓవర్లలోనే పాక్‌ లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌పై గెలవలేదనే అపవాదును పాక్‌ చెరిపేసుకుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు