India vs Pak: ఉత్కంఠ పోరులో భారత్‌పై పాక్‌ విజయం

ఆసియాకప్‌లో భాగంగా సూపర్‌-4లో భారత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో  పాక్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Updated : 04 Sep 2022 23:56 IST

దుబాయ్‌: ఆసియాకప్‌ సూపర్‌-4లో భారత్‌కు ఓటమి ఎదురైంది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియాపై పాకిస్థాన్‌ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ ఐదు వికెట్లను నష్టపోయి 19.5 ఓవర్లలో 182 పరుగులు చేసి విజయం సాధించింది. రిజ్వాన్‌ (71), నవాజ్ (42) కీలక పాత్ర పోషించారు. గెలుపు దిశగా పాక్‌ ఇన్నింగ్స్‌ సాగిన క్రమంలో రిజ్వాన్‌, నవాజ్‌ స్వల్ప తేడాతో ఔట్‌ కావడంతో భారత్‌ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. అయితే చివరలో అసిఫ్‌ అలీ(16), ఖుష్‌దిల్‌(14 నాటౌట్‌) పాక్‌ను విజయతీరాలకు చేర్చారు.  భారత బౌలర్లలో భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌, హార్దిక్‌ పాండ్య, రవి బిష్ణోయ్, చాహల్ తలో వికెట్‌ తీశారు. గ్రూప్‌ స్టేజ్‌లో పాక్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. 

రాణించిన కోహ్లీ

ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (28), రోహిత్ (28) ధాటిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెట్‌కు అర్ధశతక భాగస్వామ్యం జోడించారు. అయితే  స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్‌కు చేరారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (13), రిషభ్‌ పంత్‌ (14)తో కలిసి విరాట్‌ కోహ్లీ(60) ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అయితే మరోసారి పంత్, హార్దిక్ (0) స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది. దీపక్‌ హుడా (16) ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. విరాట్ మాత్రం చక్కగా ఆడాడు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో షాదాబ్‌ ఖాన్‌ 2.. నసీమ్‌ షా, నవాజ్‌, హారిస్‌, హస్నైన్‌ తలో వికెట్‌ తీశారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని