PCB: భార్యాపిల్లలతోపాటు వారినీ వెంటేసుకెళ్తారా..? పాక్‌ ఆటగాళ్లపై పీసీబీ మండిపాటు

టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా పాకిస్థాన్‌ ఆటగాళ్ల ప్రవర్తనపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Published : 25 Jun 2024 00:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సూపర్‌ 8కు చేరకుండానే పొట్టి ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించడంతో.. ఆ జట్టు పేలవ ప్రదర్శనపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తన కూడా చర్చలోకి వస్తోంది. దీనిపై ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.

ప్రపంచకప్‌ సందర్భంగా ఆటగాళ్లు తమ కుటుంబాలను వెంటేసుకుపోవడం.. అక్కడ పెయిడ్‌ ఈవెంట్‌లనూ నిర్వహించడంపై పీసీబీ మండిపడింది. దీంతో ఆటగాళ్లకు ప్రవర్తనా నియమావళిని రూపొందించడానికి సిద్ధమైంది. జట్టు క్రమశిక్షణా రాహిత్యానికి కొందరు సీనియర్‌ అధికారులను బోర్డు ఛైర్మన్‌ మొహసిన్‌ నఖ్వీ బాధ్యులను చేసినట్లు సమాచారం.

పీసీబీలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయి అధికారులపై చర్యలు తప్పవని.. ఆటగాళ్ల కోసం కఠిన నిబంధనలు అమలు చేయనున్నారని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఐసీసీతోపాటు పెద్ద టోర్నీలకు ఆటగాళ్ల వెంట కుటుంబాలను అనుమతించకుండా బోర్డు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పాడు.

‘చాలా మంది ఆటగాళ్లు తమ వెంట భార్యాపిల్లలనే కాకుండా.. తల్లిదండ్రులు, సోదరులనూ తీసుకెళ్లారు. వారంతా జట్టు కోసం కేటాయించిన హోటళ్లలో బస  చేశారు. ఈ విషయంలో ఛైర్మన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు’ అని  ఆ అధికారి చెప్పాడు. ఈ వ్యవహారంపై విచారణ చేస్తే.. కొందరు సీనియర్‌ అధికారులే వారికి అనుమతి ఇచ్చినట్లు తేలిందని వివరించాడు. ఇక టోర్నీ మధ్యలో అభిమానులు ఆటగాళ్లను కలిసేందుకు ఓ పెయిడ్‌ ఈవెంట్‌ను నిర్వహించడంపై మాజీ ఆటగాళ్లు ఇప్పటికే మండిపడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని