INDvsPAK: భారత్‌-పాక్‌ మళ్లీ క్రికెట్‌ ఆడాలి 

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ కొనసాగాలని, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని ఆ జట్టు మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు...

Published : 11 Jun 2021 01:54 IST

పాకిస్థాన్‌ మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ కొనసాగాలని, ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాలని ఆ జట్టు మాజీ సారథి ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు. యాషెస్‌ సిరీస్‌ కన్నా దాయాదుల పోరే ఎక్కువగా చూస్తారన్నాడు. ఆ క్షణాలను అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తారని చెప్పాడు.

‘యాషెస్‌ సిరీస్‌ కన్నా ఎక్కువ ప్రజలు భారత్‌-పాక్‌ మ్యాచ్‌లను వీక్షిస్తారు. ఇందులో ప్రతి క్షణాన్ని వారు ఆస్వాదిస్తారు. ఇరు జట్ల మధ్య ఆట బలోపేతానికి, ఆటగాళ్ల అభివృద్ధికి ఆసియా కప్‌తో పాటు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం ఎంతో ముఖ్యం. మేం టీమ్‌ఇండియాతో ఆడే రోజుల్లో గొప్ప అనుభూతి కలిగేది. అలాంటి ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సీనియర్ల నుంచి యువకులు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సచిన్‌, గంగూలీ, అజహరుద్దీన్‌, జావెద్‌ మియాందాద్‌ ఇలా ఎవరైనా కానీ కొత్తగా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు వారి దగ్గరికెళ్లి విలువైన సలహాలు, సూచనలు తెలుసుకునేవాళ్లు. ఒక క్రికెటర్‌ తన ఆటను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకొనేందుకు అదో సువర్ణ అవకాశం’ అని ఇంజమామ్‌ చెప్పుకొచ్చాడు.

తాము ఆడే రోజుల్లో ఇరు జట్ల మధ్య తీవ్రమైన పోటీ ఉండేదని, అయినా చివరికి ఇరు జట్ల ఆటగాళ్లకు ఒకరంటే ఒకరు ఎంతో గౌరవించుకునే వారని ఇంజమామ్‌ గుర్తుచేసుకున్నాడు. భారత్‌-పాక్‌ జట్ల మధ్య తిరిగి క్రికెట్‌ జరగాలని ఉందని, అందుకోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. కాగా, 2004లో సౌరభ్‌ గంగూలీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా చారిత్రక పాకిస్థాన్‌ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు భారత్‌ 2-1తో టెస్టు సిరీస్‌, 3-2తో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే 2005లో భారత పర్యటనకు వచ్చిన దాయాది జట్టు 3-2తో వన్డే సిరీస్‌ గెలుపొందగా టెస్టు సిరీస్‌ను డ్రాగా ముగించింది. చివరగా 2013లో ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక టీ20, వన్డే సిరీస్‌లు జరగ్గా.. పొట్టి సిరీస్‌ డ్రాగా ముగిసింది. వన్డే సిరీస్‌ 2-1 పాకిస్థాన్‌ కైవసం చేసుకుంది. అనంతరం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో ఐసీసీ ఈవెంట్లలో తప్ప మరెక్కడా తలపడటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని