Pakistan Team: క్రికెట్‌లో మా ప్రాభవం తగ్గుతోంది.. పీసీబీ లుక్కేయాలి: పాక్‌ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌

జట్టంతా కలసికట్టుగా ఆడితేనే విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కానీ, పాక్‌ మాత్రం ఈ సూత్రాన్ని విస్మరించినట్లుంది. టీ20 ప్రపంచకప్‌లో ఘోర ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది.

Published : 17 Jun 2024 15:42 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) నుంచి పాకిస్థాన్‌ లీగ్ స్టేజ్‌లో నిష్క్రమించింది. తన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై కష్టంగానే గెలిచింది. తమ టీమ్‌ కనీసం సూపర్-8కి కూడా అర్హత సాధించకపోవడంపై మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారత్, యూఎస్‌ఏ చేతిలో ఓటమితో పాక్‌కు అవకాశాలు గల్లంతయ్యాయి. యూఎస్ఏ-ఐర్లాండ్ మ్యాచ్‌ వర్షార్పణం కావడం కూడా పాక్‌కు ఇబ్బందిగా మారింది. జట్టుగా ఘోర ప్రదర్శన చేయడంపై పాక్‌ మాజీ కెప్టెన్ ఇంజమామ్‌ ఉల్ హక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టులో మార్పులు గురించి ఇప్పుడే చెప్పడం సరైంది కాదన్నాడు. టీ20ల్లో తమ టీమ్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసేదని.. ఇప్పుడు మాత్రం ప్రాభవం కోల్పోతుండటం బాధగా ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘మా క్రికెట్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. ఇదేదో టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏ చేతిలో ఓడింది కాబట్టే చెప్పడం లేదు. మెగా టోర్నీకి ముందు ఐర్లాండ్‌ చేతిలో ఒక మ్యాచ్‌లో ఓడాం.. ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ను కోల్పోయాం. న్యూజిలాండ్‌పైనా ఇదే ఫలితం ఎదురైంది. అప్పటివరకు పొట్టి ఫార్మాట్‌లో మా జట్టు ఆటతీరు అత్యుత్తమంగా ఉండేది. కానీ, ఒక్కసారిగా ప్రదర్శన దారుణంగా పడిపోయింది. ఇప్పటికప్పుడే జట్టులో కొందరిని తీసేయాలని చెప్పను. కానీ, పీసీబీ మాత్రం స్పందించాల్సిన అవసరం ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందనే దానిపై విశ్లేషించాలి’’ అని ఇంజమామ్‌ తెలిపాడు. 

కెప్టెన్‌ మారితే.. బాబర్‌కు చోటు కష్టమే: సెహ్వాగ్

టీ20ల్లో టాప్‌ స్కోరర్‌గా ఉన్న పాక్‌ కెప్టెన్ బాబర్‌ అజామ్‌ (4,145) ఈ ఫార్మాట్‌కే పనికిరాడంటూ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ‘‘సిక్స్‌లను ఎక్కువగా కొట్టని బ్యాటర్లలో బాబర్ అజామ్‌ ఒకడు. క్రీజ్‌లో కుదురుకుని.. స్పిన్నర్లు ఎవరైనా బౌలింగ్‌కు వచ్చినప్పుడే సిక్స్‌లు కొట్టేందుకు ప్రయత్నిస్తాడు. ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు అతడి పాదాలను కదల్చడం నేనెప్పుడూ చూడలేదు. కవర్స్‌ మీదుగా బౌండరీలు కొడదామని అస్సలు అనుకోడు. జట్టులో తన స్థానాన్ని సురక్షితంగా ఉంచుకొనేందుకే ఆడతాడు. నిదానంగా పరుగులు చేస్తాడు. కాబట్టే అజామ్‌ స్ట్రైక్‌రేట్‌ చాలా తక్కువగా ఉంటుంది. కెప్టెన్‌గా తన ఆట జట్టుకు ఏమైనా ఉపయోగపడుతుందా? లేదా? అనేది ఆలోచించాలి. తొలి ఆరు ఓవర్లలో భారీ షాట్లు కొట్టే బ్యాటర్‌ను ముందుకుపంపి.. నువ్వు తర్వాత వస్తే బాగుంటుంది. ఒకవేళ కెప్టెన్‌ మారితే మాత్రం బాబర్‌కు చోటు దక్కడం కూడా కష్టమే. ఇప్పుడు నేను చెప్పే మాటలు కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా అతడి ఆటతీరు లేదు’’ అని సెహ్వాగ్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు