Asia Cup 2023: ఆసియా కప్ విషయంలో బీసీసీఐని కాదని.. ఐసీసీ ఏం చేయలేదు: అఫ్రిది

వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023), ఆసియా కప్ (Asia Cup 2023) జరిగే సంవత్సరం ఇదే. అయితే ఇవి రెండింటికి దాయాదులే ఆతిథ్య ఇవ్వబోయే దేశాలు. భారత్‌ వేదికగా (Team India) వన్డే ప్రపంచకప్‌, పాక్‌ వేదికగా (Pakistan) ఆసియా కప్‌ జరగాల్సి ఉంది. కానీ, పాక్‌లో జరిగితే తాము వచ్చేది లేదని బీసీసీఐ కార్యదర్శి వ్యాఖ్యానించడంతో  అగ్గి రాజుకొంది.. ఇంకా ఆ చర్చ కొనసాగుతూనే ఉంది.

Updated : 16 Feb 2023 13:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) వ్యవహారం కొలిక్కి వచ్చేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 4న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భేటీ జరిగింది. ఏసీసీ అధ్యక్షుడు, బీసీసీఐ కార్యదర్శి జైషా (Jay Shah)తో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నజమ్‌ సేథీ సమావేశమైన విషయం తెలిసిందే. అయితే, మరోసారి మార్చిలో ఏసీసీ భేటీ తర్వాతనే ఆసియా కప్‌ నిర్వహణపై సందిగ్ధత తొలగనుంది. మరోవైపు ఈ టోర్నమెంట్‌ యూఏఈ వేదికగా జరిగే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. పాక్‌లో నిర్వహిస్తే భారత్‌ ఆడేది లేదని మరోసారి జైషా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో నజమ్‌ సేథీ కూడా భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాక్‌ ఆడటంపై తమ వైఖరిని ఘాటుగానే తెలియజేశాడని వార్తలు వచ్చాయి. వీటిపై టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడాడు. ప్రపంచ కప్‌ ఆడకుండా పాకిస్థాన్‌ ఉండటం కష్టమేనని వ్యాఖ్యానించాడు. తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా ఆసియా కప్‌ నిర్వహణకు సంబంధించి పీసీబీ నిర్ణయం, అశ్విన్‌ వ్యాఖ్యలపై ఓ టీవీ ఛానెల్‌లో స్పందించాడు. 

‘‘ఎవరైనా సరే తమ కాళ్ల మీద పటిష్ఠంగా నిలబడలేకపోతే.. నిర్ణయాలను కూడా బలంగా తీసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఇలాంటివారు చాలా అంశాలను పరిశీలించి నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అదే భారత్‌ను చూస్తే (Team India) తమ వైఖరి గట్టిగా చెప్పడానికి కారణాలు చాలా ఉన్నాయి. వారు ఆర్థికంగానూ, ఆటపరంగానూ బలంగా మారిపోయారు. లేకపోతే ఆ ధైర్యం వారికి రాదు.  బీసీసీఐ (BCCI) చాలా స్ట్రాంగ్‌. అందుకే నిర్ణయాలను తీసుకోగల స్థాయిలో ఉంది. ఇక ఆసియా కప్‌ కోసం పాక్‌లో భారత్‌ పర్యటిస్తుందని నేను అనుకోవడం లేదు. భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను పాక్‌ బాయ్‌కాట్ చేస్తుందనే ఆలోచనా లేదు. అయితే, కచ్చితంగా మనం ఒక పాయింట్‌కు కట్టుబడి ఉండాలి. ఇలాంటి సమయంలోనే ఐసీసీ పాత్ర చాలా కీలకం. వారే ముందుకొచ్చి సమస్యను పరిష్కరించాలి. కానీ, బీసీసీఐ ఎదుట ఐసీసీ కూడా ఏమి చేయలేదనేది నా భావన. ఇక వ్యక్తిగతంగా పాక్‌ వన్డే ప్రపంచకప్‌లో ఆడాలనేది నా ఉద్దేశం. ఇలాంటి నిర్ణయాలన్నీ ఉన్నతస్థాయిలోనే జరగాల్సి ఉంది. ఇక మన బోర్డు ఆర్థిక పరిస్థితినిబట్టి ప్రణాళికలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకూడదు’’ అని అఫ్రిది వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని