Pakistan: తిరుగుళ్లు చాలు.. ఇళ్లకు రండి: పాక్‌ క్రికెటర్లపై బ్యాటర్‌ షెహజాద్‌ విమర్శలు

పొట్టి ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యంతో స్వదేశంలో పాక్‌ ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Updated : 21 Jun 2024 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్: పాకిస్థాన్‌ (Pakistan) జట్టు ఘోర వైఫల్యాలతో టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలగడంతో ఇంటా బయటా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. దీనికితోడు ఓ అభిమానితో హారిస్‌ రవూఫ్‌ ఘర్షణ మరింత ఆజ్యం పోసింది. తాజాగా పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. జట్టు ఆటగాళ్లు సెలవులు ముగించుకొని స్వదేశానికి వచ్చేయాలని కోరాడు. 

‘‘హారిస్‌ రవూఫ్‌కు జరిగిన దానిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. అతడికి మద్దతుగా పోస్టులు పెడుతున్న పాకిస్థాన్‌ ఆటగాళ్లు ఒక విషయం గ్రహించాలి. ప్రపంచకప్‌లో అతడి పేలవ ప్రదర్శనతో ఫ్యాన్స్‌ పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఆటగాళ్లు దేశానికి క్షమాపణలు చెప్పడం మంచిది. వారు ఏమాత్రం నామోషీగా ఫీల్‌ అయినా.. వెంటనే అమెరికా, ఇంగ్లాండ్‌, దుబాయ్‌ల్లో తమ సెలవులు ముగించుకొని పాకిస్థాన్‌కు తిరిగిరావాలి. ఫ్యాన్స్‌ భావనలను ఈ పోస్టులు ఏ మాత్రం మార్చలేవు. తమ చెత్త ఆటతీరుపై అభిమానులకు జవాబు ఇవ్వాలి. బాధ్యత తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ జట్టులోని ఆటగాళ్లు గత ఐదేళ్లుగా దేశానికి ఎటువంటి గెలుపు అందించలేదు. వారు పాక్‌ సమష్టి విజయాల కంటే కేవలం వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యమిస్తూ ఆడారు’’ అని షెహజాద్‌ తీవ్రస్థాయిలో విమర్శించాడు. బాబర్‌ నాయకత్వ శైలిపై ఇతడు గతంలో కూడా మండిపడ్డాడు. 

లీగ్‌ దశలో కూడా పాక్‌ ఆటతీరును తప్పుపడుతూ షెహజాద్‌ వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌, షహీన్‌, రిజ్వాన్‌, ఫకర్‌ జమాన్‌, హారిస్‌ రవూఫ్‌ల ఆటతీరు దారుణంగా ఉందన్నాడు. తగినంత సమయం లభించినా వారు ఏమాత్రం మెరుగుపడలేదని పేర్కొన్నాడు. వారిని జట్టు నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశాడు. టీమ్‌లో గ్రూపులు కట్టి.. వైఫల్యాలను పరస్పరం సమర్థించుకొంటూ కాలం నెట్టుకొస్తున్నారని ఎద్దేవా చేశాడు. బాబర్‌ ఫిట్‌నెస్‌ దారుణంగా ఉందని, జట్టులో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించాడు. ప్రపంచకప్‌ టోర్నీకి బాబర్‌ను కెప్టెన్‌గా నియమించడమే పీసీబీ చేసిన తప్పు అని అభివర్ణించాడు. బాబర్‌, షహీన్‌ అఫ్రిది, రిజ్వాన్‌లకు మూడు గ్రూపులున్నాయని ఓ వార్త సంస్థకు ఇటీవల చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని