INDw Vs PAKw: మహిళల ఆసియా కప్‌.. హ్యాట్రిక్‌ విజయాలకు బ్రేక్‌.. పాక్‌ చేతిలో భారత్‌ ఓటమి

వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించిన భారత మహిళల జట్టుకు ఆసియా కప్‌లో తొలి ఓటమి ఎదురైంది. పాకిస్థాన్‌ చేతిలో ఓడింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాక్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 07 Oct 2022 19:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచిన భారత మహిళల జట్టు తొలి ఓటమిని మూటగట్టుకొంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పరాభవం ఎదుర్కొంది. తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకొన్న పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాక్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్ రిచా ఘోష్‌ (26) టాప్‌ స్కోరర్‌. మిగతా బ్యాటర్లలో సబ్బినేని మేఘన 15, స్మృతి మంధాన 17, రోడ్రిగ్స్‌ 2, దయాలన్ హేమలత 20, పూజా వస్త్రాకర్ 5, దీప్తి శర్మ 16, హర్మన్‌ ప్రీత్ కౌర్ 12, రాధా యాదవ్ 3, రేణుకా సింగ్‌ 2* పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో నస్రా సంధు 3, సాదియా ఇక్బాల్ 2, నిదా దార్ 2.. ఐమన్ అన్వర్, తుబా హసన్ చెరో వికెట్‌ తీశారు. భారత్ శనివారం (అక్టోబర్ 8న) బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ విజయంతో పాక్‌ నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలతో ఆరు పాయింట్లను సొంతం చేసుకొంది.  దాదాపు ఆరేళ్ల తర్వాత టీమ్‌ఇండియాపై పాక్‌ విజయం సాధించడం గమనార్హం.

నిదా దార్‌ కీలక ఇన్నింగ్స్‌

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పరుగులు సాధించేందుకు పాకిస్థాన్‌ టాప్‌ ఆర్డర్ ఇబ్బంది పడింది. పవర్‌ ప్లే ముగిసేసరికి 33 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. అయితే కెప్టెన్‌ మరూఫ్‌ (32)తో కలిసి నిదా దార్‌ (56*) కీలక భాగస్వామ్యం (76 పరుగులు) నిర్మించింది. మరోసారి టీమ్‌ఇండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప వ్యవధిలో పాక్‌ వికెట్లను చేజార్చుకొంది. అయితే నిదా దార్‌ చివరి వరకు క్రీజ్‌లో ఉండి పాక్‌కు పోరాడే స్కోరును అందించింది. మునీబా అలీ 17, అమీన్ 11, అలియా రియాజ్ 7, అయేషా నసీమ్‌ 9 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, పూజా వస్త్రాకర్ 2, రేణుకా సింగ్ ఒక వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని