T20 world cup: ఈసారి వదల్లేదు

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమే. పసికూన అమెరికా.. ఆపై చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో కంగుతినడంతో మాజీల నుంచి తీవ్ర విమర్శలు. ఇంతటి ఒత్తిడిలో పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌లో అత్యావశ్యక విజయాన్ని అందుకుంది.

Updated : 12 Jun 2024 06:49 IST

కెనడాపై పాక్‌ గెలుపు
రాణించిన రిజ్వాన్, ఆమిర్‌

ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమే. పసికూన అమెరికా.. ఆపై చిరకాల ప్రత్యర్థి భారత్‌ చేతిలో కంగుతినడంతో మాజీల నుంచి తీవ్ర విమర్శలు. ఇంతటి ఒత్తిడిలో పాకిస్థాన్‌ టీ20 ప్రపంచకప్‌లో అత్యావశ్యక విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోర్ల మ్యాచ్‌లో కెనడాపై గెలిచి కప్‌లో బోణీ కొట్టి సూపర్‌-8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఆమిర్, రవూఫ్, రిజ్వాన్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

న్యూయార్క్‌

పాకిస్థాన్‌ ఊపిరి పీల్చుకుంది. వరుస ఓటముల నుంచి బయటపడి గెలుపు బాట పట్టింది. మంగళవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కెనడాపై గెలిచింది. మొదట మహ్మద్‌ ఆమిర్‌ (2/13), హారిస్‌ రవూఫ్‌ (2/26) విజృంభించడంతో కెనడా 20 ఓవర్లలో 106/7కే పరిమితమైంది. అరోన్‌ జాన్సన్‌ (52; 44 బంతుల్లో 4×4, 4×6) టాప్‌ స్కోరర్‌. మహ్మద్‌ రిజ్వాన్‌ (53 నాటౌట్‌; 53 బంతుల్లో 2×4, 1×6) సమయోచితంగా ఆడడంతో లక్ష్యాన్ని పాక్‌ 17.2 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి అందుకుంది. బాబర్‌ అజామ్‌ (33; 33 బంతుల్లో 1×4, 1×6) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

నిలిచిన రిజ్వాన్, అజామ్‌: స్వల్ప ఛేదనలో భారత్‌ చేతిలో కంగుతిన్న విషయం గుర్తు పెట్టుకుందో.. లేక అమెరికా చేతిలో భంగపాటు జ్ఞాపకమొచ్చిందో కానీ కెనడాపై పాకిస్థాన్‌ ఆచితూచి ఆడింది. 4.1 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 20 పరుగులే! ఈ స్థితిలో ఓపెనర్‌ సయిమ్‌ ఆయూబ్‌ (6)ను హెలిజర్‌ ఔట్‌ చేసి ప్రత్యర్థిని తొలి దెబ్బ కొట్టాడు. వికెట్‌ పడినా పాక్‌ తడబడలేదు. బంతి తక్కువ ఎత్తులో వస్తుండడంతో రిజ్వాన్, కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఎక్కువ రక్షణాత్మకంగానే ఆడారు. ఈ జంట షాట్లకు వెళ్లకుండా స్ట్రెక్‌ రొటేట్‌ చేయడానికి ప్రయత్నించింది. ఆరో ఓవర్‌ వరకు ఆ జట్టు ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. అయితే రిజ్వాన్‌-అజామ్‌ కాస్త జోరు పెంచడంతో పాక్‌ 10 ఓవర్లకు 59/1తో విజయం దిశగా సాగింది. అయితే అజామ్‌ను ఔట్‌ చేసిన హెలిజర్‌ ఈ జంటను విడగొట్టాడు. రిజ్వాన్‌-అజామ్‌ జోడీ రెండో వికెట్‌కు 63 పరుగులు జత చేసింది. ఈ వికెట్‌ పడినా.. సమీకరణం (30 బంతుల్లో 22) అందుబాటులో ఉండడంతో పాక్‌ కంగారుపడలేదు. దూకుడుగా ఆడిన రిజ్వాన్‌ పని పూర్తి చేశాడు. 15 బంతులు మిగిలుండగానే పాక్‌ విజయాన్ని అందుకుంది.

కెనడా కట్టడి: అంతకుముందు కెనడా ఇన్నింగ్స్‌ మొదలైన తీరుకి ముగిసిన విధానానికి పొంతన లేదు. 2.1 ఓవర్లలో 20/0తో ఆ జట్టు దూకుడుగా మొదలుపెట్టింది. ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులను ఓపెనర్‌ అరోన్‌ జాన్సన్‌ ఫోర్లుగా మలిచాడు. కానీ ఈ ఆరంభాన్ని కెనడా కొనసాగించలేకపోయింది. మరో ఓపెనర్‌ నవ్‌నీత్‌ (4) ఔటవడంతో ఆ జట్టు కష్టాలు మొదలయ్యాయి. పవర్‌ప్లే ఆఖరికి కెనడా 2 వికెట్లు చేజార్చుకుని 30 పరుగులే చేసింది. పిచ్‌పై బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఆమిర్, రవూఫ్‌ ఎటాకింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టి పడేశారు. జాన్సన్‌ వీలు చిక్కినప్పుడల్లా షాట్లు ఆడగా.. మరోవైపు వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. పదో ఓవర్లో శ్రేయస్‌ మొవ్వా (2), రవీందర్‌ పాల్‌ (0)లను పెవిలియన్‌ చేర్చిన రవూఫ్‌.. కెనడాను  దెబ్బ కొట్టాడు. మరోవైపు జాన్సన్‌ అర్ధసెంచరీ తర్వాత వెనుదిరిగాడు. నసీమ్‌ షా ఓ బుల్లెట్‌ బంతితో జాన్సన్‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో కెనడా 14 ఓవర్లకు 75/6తో మరింత కష్టాల్లో పడిపోయింది. ఈ స్థితిలో వంద పరుగులైనా చేస్తుందా అనిపించింది. కలీమ్‌ సనా (13 నాటౌట్‌), హెలిజర్‌ (9 నాటౌట్‌) నిలిచి మూడంకెల స్కోరు దాటించారు. షహీన్‌ షా అఫ్రిది (1/21), నసీమ్‌ షా (1/24) కూడా కెనడా కట్టడిలో కీలకపాత్ర పోషించారు.

కెనడా ఇన్నింగ్స్‌: అరోన్‌ జాన్సన్‌ (బి) నసీమ్‌ షా 52; నవ్‌నీత్‌ ధలివాల్‌ (బి) ఆమిర్‌ 4; పర్గత్‌సింగ్‌ (సి) ఫకార్‌ (బి) అఫ్రిది 2; కిర్టాన్‌ రనౌట్‌ 1; శ్రేయస్‌ మొవ్వా (సి) రిజ్వాన్‌ (బి) రవూఫ్‌ 2; రవీందర్‌పాల్‌ (సి) ఫకార్‌ (బి) రవూఫ్‌ 0; జాఫర్‌ (సి) రిజ్వాన్‌ (బి) ఆమిర్‌ 10, కలీమ్‌ సనా నాటౌట్‌ 13; హెలిజర్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 106; వికెట్ల పతనం: 1-20, 2-29, 3-43, 4-54, 5-54, 6-73, 7-87; బౌలింగ్‌: షహీన్‌షా అఫ్రిది 4-0-21-1; నసీమ్‌ షా 4-0-24-1; మహ్మద్‌ ఆమిర్‌ 4-0-13-2; హారిస్‌ రవూఫ్‌ 4-0-26-2; ఇమాద్‌ వసీమ్‌ 4-0-19-0

పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌: రిజ్వాన్‌ నాటౌట్‌ 53; ఆయూబ్‌ (సి) శ్రేయస్‌ (బి) హెలిజర్‌ 6; అజామ్‌ (సి) శ్రేయస్‌ (బి) హెలిజర్‌ 33; ఫకార్‌ (సి) బజ్వా (బి) గోర్డాన్‌ 4; ఉస్మాన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (17.3 ఓవర్లలో 3 వికెట్లకు) 107; వికెట్ల పతనం: 1-20, 2-83, 3-104; బౌలింగ్‌: కలీమ్‌ 3-0-21-0; గోర్డాన్‌ 3.3-0-17-1; హెలిజర్‌ 4-0-18-2; జాఫర్‌ 4-0-23-0; జునైద్‌ 3-0-28-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని