కోహ్లీకి 6 కావాలి.. నాకు 5.68 ఇన్నింగ్స్‌లే.. అందుకే నేనే టాప్‌: పాక్‌ వెటరన్‌ క్రికెటర్‌ వింత వాదన

టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)తో రికార్డులపరంగా ప్రస్తుతం ఉన్న క్రికెటర్లెవరూ సాటిరారు. అయితే పాక్‌ వెటరన్‌ ప్లేయర్‌ మాత్రం విరాట్ కంటే తానే నంబర్‌వన్‌ ఆటగాడినంటూ గొప్పలకు పోవడం గమనార్హం. 

Published : 25 Jan 2023 14:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్ల జాబితాలో రెండో ఆటగాడు.. అన్ని ఫార్మాట్లు కలిపి ఎక్కువ శతకాలు నమోదు చేసిన రెండో బ్యాటర్.. విరాట్ కోహ్లీ. వన్డే కెరీర్‌లో సచిన్‌ (49) తర్వాత కోహ్లీ (46) మరో మూడు సెంచరీల దూరంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 74 శతకాలు నమోదు చేశాడు. అయినా సరే పాకిస్థాన్‌ వెటరన్ ఆటగాడు ఖుర్రమ్‌ మంజూర్‌ మాత్రం తనకంటే విరాట్ గొప్పేమీ కాదంటూ అతిగా స్పందించాడు. అయితే తన రికార్డులన్నీ లిస్ట్‌ - A క్రికెట్‌లోనట. పాకిస్థాన్‌ తరఫున కేవలం 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లను మాత్రమే ఆడిన ఖుర్రమ్‌ ఏకంగా భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌తోనే పోల్చుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. పాక్‌ తరఫున చివరి సారిగా 2016లో ఖుర్రమ్‌ ఆడటం గమనార్హం. తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో అతడు మాట్లాడాడు. 

‘‘విరాట్ కోహ్లీతో నన్ను నేను పోల్చుకోవడం లేదు. అయితే నిజం మాట్లాడుకోవాలంటే మాత్రం.. ఇప్పుడున్న టాప్‌ 10 వన్డే బ్యాటర్లలో నేను ప్రపంచ నంబర్‌వన్‌. నా తర్వాతే విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఎలాగంటే.. అతడు ప్రతి ఆరు ఇన్నింగ్స్‌లకు ఓ సెంచరీ సాధించాడు. అదే నేనైతే 5.68 ఇన్నింగ్స్‌లకే చేశా. ఇదే ప్రపంచ రికార్డు. దాదాపు పదేళ్లపాటు 53 సగటుతో పరుగులు సాధించా. లిస్ట్‌ - A క్రికెట్‌కు సంబంధించి నేను ప్రపంచంలోనే ఐదో ర్యాంక్‌లో ఉన్నా. గత 48 ఇన్నింగ్స్‌ల్లో 24 సెంచరీలు నమోదు చేశా. 2015 నుంచి ఇప్పటి వరకు పాక్‌ తరఫున ఓపెనర్లుగా ఆడినవారిలో నేనే అత్యధికంగా పరుగులు సాధించా. జాతీయ టీ20ల్లోనూ ఎక్కువ పరుగులతోపాటు శతకాలు చేసిన ఆటగాడిని. లిస్ట్‌ - A క్రికెట్‌లో తొమ్మిది రికార్డులను నమోదు చేశా. అయినా సరే జాతీయ సెలెక్టర్లు నన్ను పక్కన పెట్టేశారు’’ అని మంజూర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని