IND vs NZ: టీమ్‌ఇండియా జట్టు ఎంపిక బాగుంది.. ఇదే సరైంది: పాక్‌ క్రికెటర్‌

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ జట్టు ఎంపిక చాలా బాగుందని పాకిస్థాన్‌ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ ప్రశంసించాడు. ఆటగాళ్లపై పనిభారాన్ని...

Updated : 21 Nov 2021 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ జట్టు ఎంపిక చాలా బాగుందని పాకిస్థాన్‌ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ ప్రశంసించాడు. ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించేందుకు ఇదే సరైన మార్గమని విశ్లేషించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ ఆఖరి టీ20 మ్యాచ్‌ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది. విరాట్‌ కోహ్లీ స్థానంలో టీ20 జట్టుకు రోహిత్ శర్మను సారథిగా బీసీసీఐ నియమించింది. అలానే మూడు ఫార్మాట్లలో కీలకమైన  కోహ్లీతోపాటు బుమ్రా, షమీ, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. వీరి స్థానంలో హర్షల్‌ పటేల్, అవేశ్ ఖాన్, రుతురాజ్‌ గైక్వాడ్, వెంకటేశ్‌ అయ్యర్‌ వంటి వారికి చోటు కల్పించింది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. కివీస్‌పై యువ ఆటగాళ్లతో కూడిన భారత్‌ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఆఖరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆశిస్తోంది. 

‘‘యువ ఆటగాళ్లతో కూడిన టీమ్‌ఇండియా మంచి విజయాలను నమోదు చేస్తోంది. గత టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరిన కివీస్‌ను ఓడించడం బాగుంది. అయితే కివీస్‌లోనూ కొంతమంది ఆటగాళ్లు లేకపోయినా జట్టు మాత్రం పటిష్ఠంగానే ఉంది. ఇతర జట్లలా కాకుండా భారత్‌కు రిజర్వ్‌ బెంచ్‌ చాలా బలంగా ఉండటం విశేషం. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన కోసం కోహ్లీతోపాటు పలువురి సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయం సరైందే. నూతన కెప్టెన్‌ రోహిత్ శర్మ సారథ్యం చాలా బాగుంది. బ్యాట్‌తోనూ రాణించి జట్టు సభ్యులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. దీంతో భారత్‌ బాగా ఆడగలుగుతుంది. రోహిత్ శర్మ, కొత్త కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు శుభారంభం దక్కింది’’ అని కమ్రాన్‌ అక్మల్ విశ్లేషించాడు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని