Hardik Pandya: హార్దిక్‌ సత్తాపై డౌటే లేదు.. రిథమ్‌ కోసం సమయం పట్టింది: భారత కోచ్

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య ప్రపంచ కప్‌ ముందు వరకు పెద్దగా ఫామ్‌లో లేడు. కానీ, ఈ మెగా టోర్నీలో అడుగు పెట్టాక తొలి రెండు మ్యాచుల్లోనూ సత్తా చాటాడు.

Published : 12 Jun 2024 13:07 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో రాణించలేకపోయిన భారత ఆటగాడు హార్దిక్ పాండ్య (Hardik Pandya) టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచుల్లో.. కేవలం 11 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని వరల్డ్‌ కప్‌ కోసం ఎంపిక చేయడంపైనా విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడీ ప్రదర్శనతో హార్దిక్‌ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. భారత బౌలింగ్‌ కోచ్ పరాస్‌ మాంబ్రే కూడా పాండ్య ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘పాండ్య బౌలింగ్‌ సత్తాపై మాకు ఎలాంటి అనుమానాలు లేవు. ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నాం. కొన్నిసార్లు లయను అందుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఎంత ప్రయత్నించినా రిథమ్‌ను సాధించడం కష్టమవుతుంది. ఎక్కువగా సాధన చేస్తేనే నాణ్యమైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుంది. హార్దిక్‌ ఆ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయడు. నిలకడగా బంతులేయడంపై దృష్టిసారించాడు. దాని కోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేశాడు. ఇప్పుడదే కీలక మ్యాచుల్లో బయటకొస్తోంది. ఇప్పుడు బౌలింగ్‌లో సత్తా చాటుతున్న హార్దిక్‌ తప్పకుండా మున్ముందు మ్యాచుల్లో బ్యాటింగ్‌ విషయంలోనూ జట్టుకు అండగా నిలుస్తాడు. 

ఒకవేళ హార్దిక్‌ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయకపోతే టీమ్‌ఇండియాకు ఇబ్బందిగా మారేది. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేది. ఈ టోర్నీకి ముందు కూడా అతడి నిబద్ధతలో ఏమాత్రం మార్పు లేదు. పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్‌ చేయడం ఎలానో తెలుసు. గత రెండు మ్యాచుల్లో అతడి  బౌలింగ్‌ను చూశాం. ఐపీఎల్‌తో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది’’ అని మాంబ్రే వెల్లడించాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్‌లో  భారత్ వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇవాళ యూఎస్‌ఏతో టీమ్‌ఇండియా ఆడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే ‘సూపర్ - 8’కి భారత్‌ చేరినట్లే. తన చివరి మ్యాచ్‌ను కెనడాతో (జూన్ 15న) ఫ్లోరిడా వేదికగా భారత్‌ ఆడనుంది. అగ్రస్థానంతో లీగ్‌ స్టేజ్‌ను ముగించాలంటే అన్ని మ్యాచుల్లోనూ గెలవాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని