ఆమె హెలికాప్టర్‌ షాట్లకు ఆకాశ్‌ చోప్రా, సంజయ్‌ ఫిదా

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఏ ముహూర్తానా హెలికాప్టర్‌ షాట్‌ను పరిచయం చేశాడో ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. అంతర్జాతీయ, దేశవాళీ, గల్లీ క్రికెట్లోనూ ఈ షాట్‌ను అనుకరించేందుకు క్రికెటర్లంతా ప్రయత్నిస్తుంటారు. మహీలా బాదేస్తే ప్రత్యేకంగా ఫీలవుతారు....

Published : 14 Aug 2020 02:14 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఏ ముహూర్తాన హెలికాప్టర్‌ షాట్‌ను పరిచయం చేశాడో ప్రపంచమంతా ఫిదా అయిపోయింది. అంతర్జాతీయ, దేశవాళీ, గల్లీ క్రికెట్లోనూ ఈ షాట్‌ను అనుకరించేందుకు క్రికెటర్లంతా ప్రయత్నిస్తుంటారు. మహీలా బాదేస్తే ప్రత్యేకంగా ఫీలవుతారు.

తాజాగా ఏడేళ్ల అమ్మాయి హెలికాప్టర్‌ షాట్లు బాదేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆమె ప్రతి బంతినీ హెలికాప్టర్‌ షాట్‌గా మలిచేందుకే ప్రయత్నించింది. దాంతో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రా, సంజయ్‌ మంజ్రేకర్‌ ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఆకాశ్‌ చోప్రా అయితే హిందీలో తన కామెంటరీని జోడించడం గమనార్హం. ‘అగ్గిపిడుగు... ఆమె మన పరీశర్మ. అత్యంత ప్రతిభావంతురాలు కదా?’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మంజ్రేకర్‌ స్పందించారు.

‘అందరూ హెలికాప్టర్‌ షాట్‌ను సాధన చేయడం ప్రస్తుతం నేను చూస్తున్నా. వికెట్లకు అత్యంత సమీపంలో ఉండి బంతిని అందుకోవడంతో పాటు అంతర్జాతీయంగా ధోనీ ప్రాముఖ్యం తీసుకొచ్చిన మరో టెక్నిక్‌ ఇది. ఎదుగుతున్న క్రికెటర్లకు ఇదో గొప్ప షాట్‌’ అని మంజ్రేకర్‌ అన్నాడు. పరీశర్మది హరియాణాలోని రోహ్‌తక్‌. టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌ జట్టుకు ఆడాలన్నది ఆమె కోరికని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని