Paris Olympics 2024: ఆమే ఒక సైన్యం

వెయిట్‌లిఫ్టింగ్‌.. ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లో భారత్‌కు పెద్ద ఆశలు ఉండవు. 2000 సిడ్నీ క్రీడల్లో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి కంచు కొట్టిన తర్వాత లిఫ్టింగ్‌లో భారత్‌కు కలిసి రాలేదు.

Updated : 10 Jul 2024 02:46 IST

పారిస్‌ ఒలింపిక్స్‌ మరో 16 రోజుల్లో 
ఈనాడు క్రీడావిభాగం

వెయిట్‌లిఫ్టింగ్‌.. ఒలింపిక్స్‌లో ఈ ఈవెంట్లో భారత్‌కు పెద్ద ఆశలు ఉండవు. 2000 సిడ్నీ క్రీడల్లో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి కంచు కొట్టిన తర్వాత లిఫ్టింగ్‌లో భారత్‌కు కలిసి రాలేదు. ఈ క్రీడలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే లిఫ్టర్లు కూడా తక్కువే. 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ మన దేశం నుంచి ఏకైక లిఫ్టర్‌గా ఎంపికైంది మీరాబాయి చాను. ఈ మణిపురి తారపై కూడా ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. కానీ 49 కేజీల విభాగంలో అనూహ్య ప్రదర్శన చేసి రజతంతో మెరిసింది. సుదీర్ఘ విరామం తర్వాత పోడియం ఎక్కిన భారత లిఫ్టర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన తర్వాత గాయాలు ఆమెను చాలాకాలం ఆటకు దూరం చేశాయి. కానీ పునరాగమనంలో సత్తా చాటిన మీరా 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంది. ఈసారి కూడా ఈ క్రీడలో ఆమె మాత్రమే పోటీలో ఉంది. భారీ అంచనాలతో బరిలో దిగుతున్న చానుకు పతకం రంగు మార్చగల సత్తా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టోక్యోలో చేజారిన పసిడిని ఈసారి ఆమె పట్టేయగలదని ఆశిస్తున్నారు.

కనీసం 200 ఎత్తితే..: 49 కేజీల విభాగంలో స్థిరంగా రాణిస్తున్న మీరా.. పారిస్‌లోనూ అదే స్థాయిలో సత్తా చాటితే పోడియం ఎక్కడం ఖాయం. మొత్తంగా 200-210 కేజీల మధ్య బరువు ఎత్తగలిగితే ఆమె టాప్‌-3లో నిలవగలుగుతుంది. ఇప్పటిదాకా క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో ఉత్తమంగా 88 కేజీలు మోసిన మీరా.. 90 కేజీలు లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఒలింపిక్‌ ఆతిథ్య దేశం ఫ్రాన్స్‌లోనే శిక్షణ పొందుతున్న ఆమె.. గాయాల బారిన పడకుండా జాగ్రత్త పడుతోంది. ఈ విషయంలో కరణం మల్లీశ్వరి అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. 2000 ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి చరిత్ర సృష్టించిన మల్లి.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌లో పోటీ మధ్యలోనే గాయంతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య బరిలో దిగుతున్న మీరా పారిస్‌లో ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరం. గత ఏడాది ఆసియా క్రీడల్లో తుంటికి గాయం కావడం మీరా సన్నద్ధతను దెబ్బ తీసింది. అయిదు నెలలు ఆటకు దూరమైంది. కోలుకున్న తర్వాత 2024లో ఒక ఈవెంట్లో మాత్రమే పాల్గొంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో మొత్తంగా 184 కేజీలే ఎత్తి 12వ స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. అయినా కూడా మీరా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయలేం. కెరీర్‌లో మూడో ఒలింపిక్స్‌ ఆడుతున్న ఆమెకు అనుభవమే పెద్ద బలం. చైనా, జపాన్‌ లిఫ్టర్ల నుంచి పోటీని తట్టుకుని నిలవగలిగితే పారిస్‌ నుంచి పతకంతో రావడం ఖాయం. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో తొలిరోజే భారత్‌కు పతకాన్ని అందించా. ఈసారి కూడా శక్తివంచన లేకుండా పతకం కోసం ప్రయత్నిస్తా. క్రీడాకారుల కెరీర్‌లో ఒత్తిడి సాధారణమే. గాయం ఇబ్బంది పెట్టినా మళ్లీ ఒలింపిక్స్‌కు వస్తున్నా. పోడియంపై నిలుస్తాననే నమ్మకంతో ఉన్నా’’ అని మీరా చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని